లాక్ డౌన్ కారణంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కబోతున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఈ నెల 18 నుండి బస్సులను నడిపేందుకు సిద్ధమవుతున్నారు . నగదు లావాదేవీల నుంచి కూడా కరోనా వ్యాప్తిచెందే అవకాశం ఉందని తేలడంతో.. నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. అందుకోసం కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. బస్సులను అంతర్ జిల్లా సర్వీస్ లుగానే నడపాలనే యోచనలో ఉన్నారు. రాష్ట్రంలో మాత్రమే బస్సులు తిప్పనున్నారు. ఇక, బస్సుల్లో 50 శాతం సీట్లలో మాత్రమే ప్రయాణీకులను అనుమతించనున్నారు.
సిటీ బస్సులకు సైతం ఇదే నిబంధన వర్తింప జేయాలనేది ఆర్టీసీ ప్లాన్‌గా తెలుస్తోంది. అంతేకాదు.. కొద్దిరోజులు కండక్టర్ల వ్యవస్థను పక్కన పెట్టాలని నిర్ణయించారు.. బస్సుల్లో ప్రయాణికుల మధ్య తిరుగుతూ కండక్టర్లు బస్‌టిక్కెట్లు ఇస్తే కరోనా వ్యాప్తికి అవకాశం ఉందని భావించిన ఆర్టీసీ.. ప్రయాణికులకు ఆన్‌లైన్‌లో, కరెంట్ రిజర్వేషన్, బస్టాండ్లు, బస్టాపుల్లో సిబ్బంది విక్రయించే టిక్కెట్లను కొనే విధంగా అడుగులు వేస్తోంది.
ఇక, నాన్ ఏసీ బస్సుల విషయానికి వస్తే 150 కిలోమీటర్లకు పైన దూరం వెళ్లే బస్సులకు 5 స్టాప్‌లు మాత్రమే ఉండాలని.. అది కూడా ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాలి అంటున్నారు. ఇక 150 కిలోమీటర్ల లోపు బస్సు సర్వీసులు అయితే ఆర్టీసీ నిర్దేశించిన కౌంటర్లలో టిక్కెట్లు తీసుకోవాలి. నాన్ స్టాప్ బస్సులకు కూడా ఇక ఆన్‌లైన్ రిజర్వేషన్లు ఉంటాయి.