మే లోనే పదో తరగతి పరీక్షలు – కేసీఆర్

లాక్ డౌన్ కారణంగా మధ్యలోనే ఆగిపోయిన పదో తరగతి పరీక్షలను మే నెలలోనే జరపబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసారు. మార్చిలో మూడు పరీక్షలు నిర్వహించిన తర్వాత కరోనా భయాలతో హైకోర్టు ఆదేశాలమేరకు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంకా ఎనిమిది పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మంగళవారం క్యాబినెట్‌ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్‌ హైకోర్టు సూచించిన నిబంధనల ప్రకారం మిగతా 8 పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.భౌతిక దూరం పాటిస్తూ ఒక హాల్‌లో తక్కువ విద్యార్థులుండేలా ఏర్పాట్లు చేస్తాం. పరీక్ష గదులను పూర్తిగా శానిటైజ్‌ చేస్తాం.

పరీక్ష రాసే విద్యార్థులకు మాస్కులు అందిస్తాం. దీనిపై విద్యాశాఖ మంత్రి నిర్ణయం తీసుకుంటారు.పిల్లలు, తల్లిదండ్రులు టెన్షన్‌లో ఉన్నారు. వీరికోసం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటాం. విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటుచేసి. పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లి మళ్లీ తీసుకొస్తాం. ధనవంతుల పిల్లలుంటే వాళ్లకు స్పెషల్‌ కారు పాసులు కూడా ఇస్తాం. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎస్‌ఎస్‌సీ పరీక్షలను మే నెలలోనే పూర్తి చేస్తాం. ఎందుకంటే ఎస్‌ఎస్‌సీ ఆధారంగానే ఇతర అడ్మిషన్స్‌, ఇంటర్మీడియట్‌ చదువు ఆధారపడి ఉంటుంది అని సీఎం పేర్కొన్నారు. ఇక ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి కాబట్టి పేపర్లు దిద్దే కార్యక్రమం, స్పాట్‌ వాల్యుయేషన్‌ బుధవారం నుంచి ముమ్మరంగా చేపడతామని సీఎం తెలిపారు. ఇంటర్‌ విద్యార్థులకు కూడా ఇబ్బందులు లేకుండా చేస్తామని స్పష్టం చేసారు.