ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 1100 వందల కేసులు నమోదు కావడం తో రాష్ట్ర ప్రజలను వణిపోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి మూలంగా రాష్ట్రంలో కేసులు విపరీతం అవుతున్నాయి. కర్నూల్ లో అత్యధికంగా కేసులు నమోదు అవుతుండడం తో అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు.
తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్ కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో కోవిడ్- 19 వేగంగా వ్యాపిస్తున్న విషయం ముఖ్యమంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం మాజీ మంత్రి దేవినేని ఉమా ట్వీట్ చేశారు.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో జగన్ తాడేపల్లిలోని రాజప్రాసాదం దాటి బయటకు రావడం లేదని దేవినేని ఉమా విమర్శించారు. ఇప్పటికైనా మేల్కొని ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలు తెలుస్తాయని హితవు పలికారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 12 జిల్లాలు రెడ్‌జోన్‌లోకి వెళ్లాయని.. ఇకనైనా కేసులు, రిపోర్టుల విషయంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.