అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్టుబడి రాయితీ అందించాలని డిమాండ్ చేశారు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ . రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కోతకు వచ్చిన, కల్లాల్లో ఉన్న పంట నీట మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న వరి రైతులకు ప్రభుత్వం ఉపశమన పథకాలు అమలు చేయాలని కోరారు.
కరోనాతో పాటు అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయని , 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే ధరల స్థిరీకరణ నిధికి రూ.3వేల కోట్లు కేటాయించారని… ఆ మొత్తం నుంచి నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల నుంచి వసూలు చేసే నీటి తీరువా పన్ను రెట్టింపు చేయాలనే ఆలోచన సరికాదని అన్నారు.