ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉంది. ఈ కరోనా కేసులు కంట్రోల్ చేయడానికి ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. లాక్ డౌన్ పటిష్టం గా పాటిస్తూ …కొత్తవారు రాష్ట్రంలోకి రాకుండా చెక్ పోస్ట్ ల దగ్గర నిఘా ఏర్పటు చేస్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో ఆర్ఎంపీల తీరు వల్ల వైరస్ పెరుగుతున్నాయని పలు సంఘటనల ద్వారా బయటపడుతున్నాయి.
కరోనా లక్షణాలున్న వారికి వైద్యం చేయొద్దని ప్రభుత్వం చెబుతున్నా వినకుండా.. రాజమండ్రి, కత్తిపూడిల్లో వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు ఆర్ఎంపీ డాక్టర్‌లు. లాక్‌డౌన్‌ను అవకాశంగా చేసుకుని క్లీనిక్‌లో రహస్య సేవలు అందిస్తున్నారు. పదేపదే వైద్యశాఖ హెచ్చరించినా సమాచారం ఇవ్వకుండా వైద్యం చేయడంతో.. కత్తిపూడిలో ఉపాధ్యాయుడు, రాజమండ్రిలో యువతికి ఆర్ఎంపీలు వైద్యం చేశారు. ఈ రెండు ఘటనల్లోని నిర్లక్ష్యంతో ఏకంగా 20 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రజలు కూడా క్లినిక్‌లు లేవనే కారణంతో వీరినే ఆశ్రయిస్తున్నారు. ఇలా వచ్చే కేసుల్లో జ్వరం ఉన్న వారి వివరాలు ప్రభుత్వానికి అందించకుండా రహస్యంగా వైద్యం చేస్తున్నారు ఆర్‌ఎంపీలు. వారితో కాంటాక్ట్ అవడంతో.. సుమారు 80 మంది నుంచి శాంపిళ్లు తీసుకున్నారు.. వారి నుంచి ఎటువంటి రిపోర్టు వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తుంది.