TSRTC ఫై కరోనా దెబ్బ ఏ రేంజ్ లో ఉందో తెలుసా..?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు మాత్రమే కాదు రవాణా వ్యవస్థ కూడా స్థంభించిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడం తో సదరు సంస్థలకు కోట్లలో నష్టాలూ వస్తున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే..ఇప్పటికే అప్పుల్లో ఉన్న TSRTC కి కరోనా దెబ్బ భారీగా పడింది.

లాక్‌డౌన్‌కు ముందు కార్మికుల సమ్మెతో తీవ్రంగా నష్టపోయిన ఆర్టీసీకి ఇప్పుడు కరోనా రూపంలో దెబ్బతగిలింది. లాక్‌డౌన్‌తో ప్రతిరోజు ఆర్టీసీ మూడున్నర కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలోని 97 బస్ డిపోలు, 3 బస్ బాడీ గ్యారేజ్‌లు ఉండగా 10వేల 400 బస్సులు ఉన్నాయి.. ఇప్పుడు ఈ బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి.

సాధారణంగా ప్రతిరోజు ఆర్టీసీ సర్వీసులు 36 లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి. ఇందుకు 4కోట్ల 90 లక్షల విలువైన 7 లక్షల లీటర్ల డిజిల్ ఖర్చు అవుతుంది. నెలకు జీతాల రూపంలో 230 కోట్లు ఉద్యోగులకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ప్రతీనెలా సుమారు వంద కోట్ల రూపాయల అప్పులు, వడ్డీలు కూడా చెల్లిస్తోంది. ఇలా ఏవిధంగా చూసినా లాక్ డౌన్ వల్ల ఆర్టీసీ వందల కోట్ల నష్టాన్ని చవి చూడాల్సి వస్తోంది