చైనా ప్రభుత్వంపై అమెరికా మంత్రి మైక్ పాంపియో తీవ్ర విమర్శలు గుప్పించారు. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పుడే తమ దేశ వైద్య బృందానికి అనుమతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనికి చైనా ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని, పారదర్శకంగా ఉండాలని అన్నారు. కరోనా వైరస్ వుహాన్‌లోనే పుట్టిందని అందరికీ తెలుసని, అక్కడే ప్రయోగశాల ఉన్నప్పుడు తమ అధికారులకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని చైనాను ప్రశ్నించారు.
‘మాకిప్పుడు జవాబులు కావాలి. పారదర్శకత కావాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తన కర్తవ్యాన్ని నిక్కచ్చిగా చేయాలి. ప్రపంచానికి సరైన, కాలానుగుణ, సమర్థ, నిజమైన సమాచారం ఇవ్వాలి. వారీ పని చేయలేదు. ప్రపంచానికి మేలు చేసే సంస్థలు అవసరం. అమెరికన్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోని ఆ సంస్థకు అమెరికన్ పన్నుదారుల డబ్బులను ఒక్క డాలర్ కూడా ఇవ్వం’ అని పాంపియో చెప్పారు.