ఏపీ లో కరోనా కంగారు.. పెరుగుతున్న కేసులు


ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 402కి చేరింది.

గుంటూరులో 14, కర్నూలులో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున కొత్తగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 909 మందికి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా.. అందులో 37 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

కాగా గుంటూరు జిల్లాలోనే మరో 14 కేసులు నమోదయ్యాయి. వీటిలో 13 గుంటూరు నగరంలోనే నమోదవడం గమనార్హం. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 72కి చేరింది. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ తెలిపారు.