ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ కనగరాజ్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి వి. కనగరాజ్‌ నియామకం అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం జస్టిస్‌ కనగరాజ్‌ బాధ్యతలు స్వీకరించారు. మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసి కనగరాజ్‌ పదవీవిరమణ పొందారు. దాదాపు 9 సంవత్సరాల పాటు కనగరాజ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. విద్య, బాలలు, మహిళలు, వృద్ధుల సంక్షేమం అంశాలకు సంబంధించి పలు కీలక తీర్పులు ఇచ్చారు కనగరాజ్‌.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా ఉన్న ఏపీ ఎన్నికల కమీషనర్ రమేశ్ కుమార్‌ను జగన్ ప్రభుత్వం తొలగించింది. ఆర్డినెన్స్ ద్వారా రమేశ్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పించింది.

మార్చి నెలలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాగా.. కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్ఈసీ రమేశ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ప్రోద్బలంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార పక్షం ఆరోపించింది. సీఎం జగన్ సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఎన్నికలు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో గవర్నర్‌ హరిచందన్‌‌ వద్దకు వెళ్లడంతో.. ఆయన సీఈసీని తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడడం జరిగింది.