హెచ్‌-1బీ వీసాదారుల్లో ఆందోళన

కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. ఈ క్రమంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. దీంతో అమెరికాలో ఉన్న హెచ్‌-1బీ వీసాదారుల్లో ఆందోళన మొదలైంది. అగ్రరాజ్యంలో అనేక కంపెనీలు ఆర్థికంగా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

అమెరికాలోని టెక్ సంస్థలకు కరోనా తీవ్ర విఘాతం కలిగించడంతో దాదాపు 90,000 మంది హెచ్1బీ వీసాదారుల భవిష్యత్తుపై అంధకారం నెలకొంది. వీరికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీలు చేతులెత్తేయడంతో ఇప్పుడు వీరంతా తమ దేశాలకు వెళ్లిపోక తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే చాలామంది జీతాల్లేకుండానే పనిచేస్తున్నారు. అమెరికాలో సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయో తెలియని అనిశ్చితి ఏర్పడగా, హెచ్1బీ వీసాదారులను కొనసాగించడం టెక్ కంపెనీలకు మోయలేనంత భారంగా మారింది.