మక్కల్ నీది మయ్యమ్ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ..ప్రధాని మోడీ కి ఘాటైన లేఖ రాసారు. ఆ లేఖ లో కరోనా మహమ్మారిని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొనే తీరును తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా మూడు వారాల పాటు ప్రకటించిన లాక్డౌన్ అమలు లోపభూయిష్టంగా ఉందని వ్యాఖ్యానిస్తూ సార్ ఈసారి మీ విజన్ విఫలమైందని లేఖలో ప్రస్తావించారు. ప్రణాళికాబద్ధంగా లాక్డౌన్ ప్రకటించని లోపానికి సాధారణ ప్రజలను నిందించలేమని, ఇంతటి విపత్తుతో ముంచుకొచ్చిన మహమ్మారి కట్టడికి ఎలాంటి ప్రణాళిక, కసరత్తు లేకుండా నోట్ల రద్దు తరహాలోనే లాక్డౌన్ ప్రకటించిన ప్రధాని నిర్ణయం సరైంది కాదని అన్నారు.
140 కోట్ల మంది ప్రజలను కేవలం 4 గంటల వ్యవధిలో లాక్డౌన్కు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చిన మీకు నాలుగు నెలల ముందే వైరస్ సమాచారం ఉన్నా 4 గంటల నోటీసుతోనే ప్రజలకు లాక్డౌన్ ఉత్తర్వులు జారీ చేశారని ప్రధానిని ఉద్దేశించి కమల్ హాసన్ పేర్కొన్నారు. నోట్ల రద్దు తరహాలోనే భారీ స్ధాయిలో మరో తప్పిదం చోటుచేసుకుంటుందా అనే భయం తనను వెంటాడుతోందని అన్నారు.