లైట్లు అర్పివేయడంతో ప్రమాదం లేదు

ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు స్విచ్ఛాఫ్ చేసి, కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి కరోనాపై పోరాడుతున్న దేశ స్ఫూర్తిని చాటాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి సంజీవ్ నందన్ సాహ్లి లేఖ రాశారు. అందరూ ఒకే సారి లైట్లు ఆపివేయడం వల్ల గ్రిడ్‌పై ఒకేసారి ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం కేవలం లైట్లు మాత్రమే ఆపమని చెప్పిందని, ఇంట్లోని ప్రిజ్‌, ఏసీ, టీవీ తదితర వస్తువులను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

కాగ ఇలా లైట్లు అర్పివేయడం వలన పవర్ గ్రిడ్‌పై ప్రమాదకర ప్రభావం పడుతుందని, ఎమర్జెన్సీ సేవలకు విఘాతం కలుగుతుందని మహారాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి నితిన్ రౌత్ హెచ్చరించారు. లైట్లను స్విచ్ఛాఫ్‌ చేయకుండానే దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని ఆయన సూచించారు. ఒకేసారి దేశం మొత్తం లైట్లు ఆఫ్‌ చేస్తే విద్యుత్‌ గ్రిడ్‌ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ నేపధ్యంలో కేంద్రం నుండి వివరణ వచ్చింది.