దిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌కు వెళ్ళి వచ్చిన వారిలో ఇంకా కొందరి ఆచూకీ లభించకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఎంతమంది దొరకలేదన్న విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. రాష్ట్రం నుంచి మొత్తం 1030 మంది దిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వెళ్ళి రాగా వారిలో జీహెచ్ఎంసీ పరిధిలో 603 మంది, జిల్లాలకు చెందిన వారు 427 మంది ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రం మిగిలిపోయిన వారి కోసం గాలింపు జరుగుతూనే ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇంకా ఆచూకీ దొరకని వారు పదుల సంఖ్యలోనే ఉంటారని తెలుస్తోంది.
ఇదీలావుంటే దిల్లీలోని నిజాముద్దీన్‌లో నిర్వహించిన తబ్లిగీ జమాత్ సమ్మేళనం కారణంగా దేశంలోని 14 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత రెండు రోజుల్లో ఈ సమావేశానికి హాజరైన వారిలో 647 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొంది.