తమిళనాట కరోనా విలయం


తమిళనాట కరోనా ఒక్కసారిగా పడగవిప్పింది. ఈ ఒక్కరోజులోనే తమిళనాట 102 మందికి కరోనా పాజటివ్‌గా నిర్ధారణ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేశ్‌ వెల్లడించారు. వీరిలో 100 మంది తబ్లీగీ జమాత్‌కు హాజరైనవాళ్లేనని తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 411 కాగా.. వారిలో 364 మంది దిల్లీలో మర్కజ్‌కు వెళ్లినవారేనని తెలిపారు.

ఇదీలావుంటే దేశరాజధాని నగరంలోని నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్‌ నిర్వహించిన మతపరమైన కార్యక్రమం ద్వారా రెండు రోజుల్లోనే దేశంలో 647 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలోని 14 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 960 మంది విదేశీ తబ్లీగీ జమాత్‌ కార్యకర్తలపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.