కరీంనగర్‌లో మరో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం లాక్ డౌన్ తో ప్రజలను కట్టడి చేసినప్పటికీ ..రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. శుక్రవారం కరీంనగర్‌లో మరో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి సుజాత తెలిపారు. నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయినట్లు ఆమె ప్రకటించారు.

ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన 19 మందిని గుర్తించినట్లు తెలిపారు. మర్కజ్‌ వెళ్లొచ్చిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ రాగా.. ఇండోనేషియా వాసులతో సన్నిహితంగా తిరిగిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. కరోనా సోకిన బాధితులను గాంధీ, కింగ్‌కోఠి ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో మరో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ వెల్లడించారు. బాన్సువాడకు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. ఇద్దరు కరోనా బాధితులు ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చినట్లుగా తెలిపారు.