ప్రపంచ దేశాలన్నిటిని గజగజలాడిస్తున్న కరోనా వైరస్..ఆ ఒక్క దేశంలో మాత్రం ఎంట్రీ ఇవ్వలేకపోతుందట. ఆ దేశం కూడా చైనా పక్కన దేశమే..ఏంటా ఆ దేశం అనుకుంటున్నారా ఉత్తర కొరియా. తొలిసారిగా కరోనా వైరస్ పొరుగున ఉన్న చైనాలోనే వెలుగుచూసి.. అక్కడ కల్లోలం సృష్టించింది. వుహాన్ నగరానికి రెండు నెలలపాటు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇక్కడ మొదలైన వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకూ విస్తరించినా, పక్కనే ఉన్న ఉత్తర కొరియాలోకి మాత్రం ప్రవేశించలేకపోయిందట.
దీనికి కారణం చైనాలో వైరస్ వెలుగుచూసిన వెంటనే అప్రమత్తమైన ఉత్తర కొరియా జనవరిలోనే ఆ దేశంతో ఉన్న సరిహద్దులను మూసేసింది. కఠినమైన ఆంక్షలు విధించి, విదేశీ పర్యాటకులను అనుమతించలేదు. దేశంలోకి వైరస్ వ్యాప్తిచెందకుండా తాము చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని ఉత్తర కొరియా సెంట్రల్ ఎమర్జెన్సీ అంటువ్యాధుల నిర్మూలన కేంద్రం డైరెక్టర్ పక్ మియాంగ్ సూ తెలియజేశారు. ఇప్పటి వరకూ తమ దేశంలో ఎవ్వరికీ కరోనా వైరస్ సోకలేదని ఏఎఫ్‌ఫీ మీడియాకు వెల్లడించారు.