గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ తన పుట్టిన రోజు నాడు గొప్ప మనసు చాటుకున్నాడు. నిన్న (మార్చి 31) హరీష్ పుట్టిన రోజు ఈ సందర్బంగా అనాథ పిల్లలకు రెండు నెలలపాటు వారికి ఆహారాన్ని అందించనున్నారు.
ప్రస్తతం లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అనాధ పిల్లలు అన్నం కోసం అలమటిస్తూ కాస్త సాయం చేయండి మాకు అన్నట్లు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ 45 మంది అనాథ పిల్లలకు రెండు నెలలకు సరిపడే స్వీట్స్, స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, కేక్స్, తదితర ఆహార పదార్థాలను అందజేయనున్నట్లు ప్రకటించారు.
మరోవైపు సినీ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి సారథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ప్రారంభించిన కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోలంతా విరాళాలు అందజేయగా.. ఇప్పుడు చిన్న నటులు కూడా తమ వంతు సాయం అందజేస్తున్నారు. హీరో, సహాయ నటుడు శ్రీకాంత్ రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే, కమెడియన్ సప్తగిరి రూ.2 లక్షల సహాయాన్ని ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు.