మహాత్మా మాటలను గుర్తుచేసుకున్న లేడి అమితాబ్

లేడి అమితాబ్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి..ప్రస్తుతం దేశంలో జరుగుతున్న కరోనా వైరస్ తాకిడి చూసి ఆనాడు మహాత్మ మాటలను తన ట్విట్టర్ లో గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రకృతి ప్రతి ప్రాణి ఆకలినీ తీర్చగలదు, అత్యాశను కాదు’ ఓ మహాత్మా… మహర్షీ.. భారతదేశపు జాతిపితా… మీరు ఆనాడు చెప్పిన భాష్యం సత్యమై.. వాస్తవమై.. ఈ రోజు అనేక దేశాలు, ప్రభుత్వాలు, అధికార వ్యవస్థలు అతలాకుతలమవుతూ అత్యాశల వ్యాపార వ్యవస్థలను మూసివేసి ఆకలి తీర్చే ప్రకృతిమాత ప్రసాదాలైన నిత్యావసరాలను ప్రజలకు అందించటానికి సతమతమవుతున్నాయి. మీ ప్రవచన విలువలు భారతావనికే కాదు యావత్ ప్రపంచానికి నిత్య సుభాషితాలు’’ అని విజయశాంతి ట్వీట్ చేసింది.

అలాగే కరోనా పట్ల పోలీస్, వైద్య శాఖా చేస్తున్న తీరుపై ట్వీట్ చేసింది. పోలీసు, వైద్య సంబంధిత ఇతర అధికారులు కూడా మాస్క్‌లు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ, నియంత్రణపై అవగాహన కల్పిస్తూ పనిచేస్తున్నారని అన్నారు. ‘‘కరోనా అంత ప్రమాదకరం కాదేమో… లేకపోతే సీఎంగారు ఎందుకంత అజాగ్రత్తగా ఉంటారు? అన్న భావంతో రోడ్లపైకి ఇంకా కొందరు ఇబ్బడి ముబ్బడిగా జనం వస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ జాగ్రత్త కూడా ప్రజలకు వెళ్ళే సంకేతాల దృష్ట్యా ముఖ్యమే. అలాగే, ఇంత సహకరిస్తున్న ప్రజలపై, దాష్టీకం చూపకుండా ప్రభుత్వం కూడా అధికారులను నిర్దేశించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు కొన్ని సందర్భాలలో తీవ్రమైన వైఖరిని ప్రదర్శించాల్సిన పరిస్థితులు ఉంటాయన్నది వాస్తవమే అయినా… అవతలి ప్రజలు కూడా నేరస్థులు కాదన్నది అర్థం చేసుకోవాలి.’’ అని ట్వీట్ చేసింది.