చిరంజీవిని ఆకాశానికి ఎత్తిన సాయి..

ప్రముఖ రైటర్ సాయి మాధవ్ బుర్రా..మెగా స్టార్ చిరంజీవి ని ఆకాశానికి ఎత్తారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంతో మాటల రచయిత గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన..ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి చిత్రానికి పనిచేసారు. ఆదివారం సాయంత్రం జరిగిన సైరా ప్రీ రిలీజ్ వేడుక లో సాయి మాధవ్ చిరంజీవి గొప్పతనం గురించి ఎంతో చెప్పి అభిమానులను ఆకట్టుకున్నారు.

‘‘తరలి రాద తనే వసంతం.. తన దరికి రాని వనాల కోసం అన్నట్టు మెగాస్టార్ ఒక్క పిలిపిస్తే వసంతాలు కాదు సముద్రాలు కూడా తరలి వస్తాయి’’ అంటూ మొదలు పెట్టారు. ‘‘మా అమ్మమ్మ సినిమా పిచ్చిది. 80ల్లో హీరోలెవరూ మా అమ్మమ్మకు తెలీదు. కానీ, ఒక్క చిరంజీవి గారు మాత్రం మా అమ్మమ్మకు తెలుసు. టేప్ రికార్డర్‌లో ఒక క్యాసెట్‌ను పెట్టుకుని ఆ పాటను ప్రతి రోజూ ఎంజాయ్ చేస్తూ ఉండేది. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ.. కొండెక్కి చూసింది చందమామ.. కోయిలమ్మ గొంతులో రాగాలు.. చందమామ మనసులో భావాలు.. దిద్దినకదింత, దిద్దినకదింత. ఆ దిద్దినకదింత అన్నప్పుడు మా అమ్మమ్మ ఎంత ఎంజాయ్ చేసేదో నేను కళ్లారా చూశాను. అప్పుడు మా అమ్మమ్మకు 65 ఏళ్లు.

నేను కృష్ణానగర్‌లో అవకాశాల కోసం తిరుగూ ఉంటే నాకు ఫోన్ చేసి.. అరేయ్, చిరంజీవిని కలవరా, ఆయనకి సినిమా రాయరా, ఒక్క డైలాగైనా ఆయనకు రాయరా అంటూ ఉండేది. చిరంజీవిగారికి మాటలు రాయడం ఏంటమ్మమ్మా.. అది జరిగే పనికాదు, అలాంటి అవకాశాలు రావు, ఆకాశాన్ని అందుకోమని చెబుతున్నావు, అది జరిగే పనికాదు, ఫోన్ పెట్టేయ్ అని చెప్పేవాడిని. అలాంటి నేను చిరంజీవి గారి సినిమాకి మాటలు రాశాను.

ఖైదీ నంబర్ 150 సినిమాకి వేమారెడ్డితో కలిసి నన్ను మాటలు రాయమని చిరంజీవి అడిగారు. సార్, మీకు ఒక్క డైలాగ్ రాసినా చాలు నాకు.. ఈ జన్మధన్యం అని చెప్పి వచ్చేశాను. అప్పుడనుకున్నాను.. చిరంజీవి చెబితేనే సరితూగే డైలాగు రాయాలి అని. ఆ స్థాయిలో డైలాగు రాయాలి అని అనుకొని రాశాను, అదే.. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది అని. ఈ డైలాగు చిరంజీవిగారు తప్ప ఇంకెవ్వరు చెప్పినా జనం ఒప్పుకోరు అని ఎంతో ఆవేశం గా మాట్లాడి చిరు ఫై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈయన మాట్లాడుతున్నంత సేపు స్టేడియం మొత్తం దద్దరిల్లి పోయింది.