నిన్న తెలుగు దేశం పార్టీ తలపెట్టిన ఛలో ఆత్మకూరు కార్యక్రమం హింసాత్మకం అయ్యింది. చంద్రబాబు నాయుడును ఇంట్లోంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోగా కొందరు నాయకులు మాత్రం ఆత్మకూరు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అందులో నన్నపనేని రాజకుమారి కూడా ఒకరు. ఆమె తనతో పాటు కొందరిని తీసుకుని ఆత్మకూరు వెళ్లేందుకు సిద్దం అయ్యింది. ఆ సమయంలో మహిళ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దాంతో ఆమె తిట్ల దండకం అందుకుంది.
అక్కడే ఉన్న ఒక ఎస్సైను కులం పేరుతో దుర్బాషలాడింది. దాంతో ఆ ఎస్సై అక్కడ నుండి కన్నీరు పెట్టుకుని వెళ్లి పోయింది. ఆమె డ్యూటీ నుండి వెళ్లిపోయే సమయంలో నన్నపనేనిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ అక్కడ నుండి వెళ్లింది. ఈరోజు ఆ లేడీ ఎస్సై ఫిర్యాదు చేసింది. తనను కులం పేరుతో దూషించింది అంటూ కేసు నమోదు చేయడంతో నన్నపనేని చికుల్లో పడ్డట్లయ్యింది. తనపై కేసు నమోదు అవ్వడంపై నన్నపనేని స్పందించింది. ఆ ఎస్సై కులం ఏంటో తనకు తెలియదు అని, అలాంటప్పుడు ఆమెను కులం పేరుతో ఎలా దూషిస్తానంటూ ప్రశ్నించింది.