నేను సీఎం అయినందున కోర్టుకు రాలేను : జగన్‌

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. ఆ విచారణకు ప్రతి శుక్రవారం జగన్‌ కోర్టుకు హాజరు అవుతూనే ఉన్నాడు. అయితే ఇటీవల జగన్‌ సీఎం అయిన తర్వాత కోర్టుకు హాజరు అవ్వడం లేదు. తాజాగా కోర్టులో జగన్‌ పిటీషన్‌ దాఖలు చేశాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కారణంగా చాలా బిజీగా ఉంటున్నాను. రాష్ట్ర అర్ధిక పరిస్థితి అస్సలు బాగాలేదు. ఇలాంటి సమయంలో నేను ప్రొటోకాల్‌, భద్రత అంటూ కోర్టుకు హాజరు అయితే ప్రభుత్వంకు అదనపు భారం అవుతుందని అన్నాడు.

తన బదులుగా తన న్యాయవాది అశోక్‌ రెడ్డి హాజరు అవుతాడు అంటూ తన పిటీషన్‌లో జగన్‌ కోరాడు. ఎప్పుడైతే విచారణకు తన అవసరం ఉంటుందని కోర్టు భావిస్తుందో అప్పుడు తప్పకుండా నేను వస్తానంటూ హామీ పత్రంను కూడా సమర్పించాడు. ముఖ్యమంత్రి హోదాలో తను కోర్టుకు హాజరు కావడం వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై దెబ్బ పడుతుందనే అభిప్రాయంను కూడా ఆయన వ్యక్తం చేశాడు. నేడు జగన్‌ పిటీషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది. మరి సీబీఐ కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.