స్కూల్‌కు రూ.618 కోట్ల కరెంట్‌ బిల్లు

ఒకప్పుడు కరెంట్‌ బిల్లులు వందల్లో రావడం కామన్‌గా ఉండేది. కాని పెరిగిన చార్జీలు మరియు వినియోగంతో వేలకు వేలు కరెంటు బిల్లులు వస్తున్నాయి. అయినా కూడా తప్పదన్నట్లుగా విద్యుత్‌ బిల్లులను కడుతూనే ఉన్నారు. అయితే కొన్ని సార్లు విద్యుత్‌ వినియోగదారులు గుండెలు పట్టుకునేంతగా కరెంటు బిల్లు వస్తూ ఉంటుంది. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం మనం చూశాం. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటన జరిగింది.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని ఒక స్కూల్‌కు ఒక నెల కరెంటు బిల్లు వచ్చింది. ఆ బిల్లును చూసిన స్కూల్‌ ప్రిన్సిపల్‌కు దాదాపుగా గుండె పోటు వచ్చినంత పనైంది. అందులో ఏకంగా 618 కోట్ల రూపాయల బిల్లు ఉంది. ఈ విషయాన్ని వెంటనే స్థానిక ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌లో తెలియజేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. పై పెచ్చు 10 వ తారీకు వరకు చెల్లించకుంటే మీ కనెక్షన్స్‌ తొలగించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంత మొత్తం ఎలా చెల్లిస్తామన్నా కూడా వారు పట్టించుకోలేదు. దాంతో ఉన్నతాధికారుల వద్దకు ఈ విషయం వెళ్లడంతో సాఫ్ట్‌ వేర్‌ సమస్య అని తేల్చారు. రెండు వేల బిల్లుకు అంత మొత్తం వచ్చింది. రాష్ట్రం మొత్తం కలిపి ఈనెల అంత బిల్లు అయ్యి ఉండవచ్చు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.