తీహార్‌ జైలుకు చిదంబరం

ఐఎన్‌ఎక్స్‌ మీడియా ఆర్ధిక నేరం కేసులో విచారణ ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి.. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు చిదంబరంకు మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే అరెస్ట్‌ను తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఆయన అరెస్ట్‌ను తప్పించుకోలేక పోయారు. అర్ధరాత్రి సమయంలో ఆయన ఇంటి గోడను దూకి మరీ సీబీఐ వారు ఆయన్ను అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. అరెస్ట్‌ అయిన వెంటనే బెయిల్‌ వస్తుందని భావించినా కూడా సీబీఐ విచారణ నిమిత్తం ఆయన్ను కస్టడీలోనే ఉంచుకున్నారు.

తాజాగా మరోసారి సీబీఐకి ప్రత్యేక కోర్టు చిదంబరంను కస్టడీకి ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు చిదంబరంను నేటి నుండి ఈనెల 19వ తారీకు వరకు అంటే 14 రోజుల పాటు తీహార్‌ జైల్లో ఉంచబోతున్నారు. కరడు గట్టిన నేరస్తులకు స్థానం అంటూ దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న తీహార్‌ జైలుకు చిదంబరంను పంపించడం పట్ల కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై బీజేపీ నాయకులు కక్ష సాధిస్తున్నారు అంటూ కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.