ఛార్మికి చుక్కలు చూపిస్తున్న ఇస్మార్ట్‌ బయ్యర్లు

పూరి దర్శకత్వంలో తెరకెక్కి ఆమద్య విడుదలైన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. రామ్‌ హీరోగా నభా నటేష్‌ మరియు నిధి అగర్వాల్‌లు జంటగా నటించిన ఆ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. కేవలం 15.. 16 కోట్లకు అమ్ముడు పోయిన ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం ఏకంగా 45 కోట్ల వరకు రాబట్టిందని ట్రేడ్‌ వర్గాల నుండి సమాచారం అందుతోంది. బయ్యర్లు ఈ చిత్రంతో భారీగా లాభపడ్డారు. అయితే సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు సినిమాకు వచ్చిన లాభాలను నిర్మాతలు అయిన పూరి మరియు ఛార్మీలకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారట.

గతంలో పలు సార్లు ఛార్మీ తమకు రావాల్సిన మొత్తం ఇవ్వాలంటూ పలువురు బయ్యర్లను పదే పదే కోరగా వారిలో కొందరు ఇవ్వగా కొందరు మాత్రం ఇంకా ఇవ్వకుండా నాన్చుతున్నట్లుగా తెలుస్తోంది. మొదట ఒప్పందం చేసుకున్నదాని ప్రకారం వారు ఇవ్వాల్సి ఉన్నా కూడా వారు మాత్రం ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. అలా ఇస్మార్ట్‌ శంకర్‌కు ఇంకా 10 కోట్ల వరకు వస్తాయని నిర్మాతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బయ్యర్లు ఎప్పుడు దయతలిచి ఇచ్చేనో చూడాలి. మరో వైపు విజయ్‌ దేవరకొండతో పూరి సొంత బ్యానర్‌లో సినిమాను మొదలు పెట్టాడు. ఆ సినిమాకు కూడా ఛార్మీ ప్రొడక్షన్‌ వర్క్‌ చూసుకోనుంది.