ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి వలసలు అనేవి చాలా కామన్‌గానే చూస్తూ ఉంటాం. రాజకీయాల్లో అది చాలా తరుచుగా జరుగుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి కింది స్థాయి నాయకుల నుండి పై స్థాయి నాయకుల వరకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పటికే ఏపీలో పలువురు టీడీపీ నాయకులు ఇతర పార్టీలోకి జాయిన్ అవుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా వైకాపా మరియు బీజేపీల వైపు తెలుగు దేశం పార్టీ నాయకులు చూస్తున్నారు.
ఎమ్మెల్యేలు పార్టీ మారితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని, సభ్యత్వం రద్దు చేస్తామంటూ హెచ్చరించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు పార్టీ మారడం లేదు. కాని నాయకులు మాత్రం టీడీపీ మరియు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి అయిన సినీ నటి దివ్య వాణి కూడా తెలుగు దేశం పార్టీని వీడి బీజేపీలో జాయిన్ కాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు దేశం పార్టీకి భవిష్యత్తు లేదని ఆ పార్టీ నాయకులు స్వయంగా అనుకుంటున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా దివ్య వాణి స్పందించింది. తాను ప్రాణం ఉన్నంత కాలం టీడీపీలోనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. కష్టాల్లో ఉన్న పార్టీకి అండగా ఉండే వారే అసలైన నాయకులు అంటూ దివ్య వాణి పేర్కొంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ బలోపేతంకు పని చేస్తానంటూ ఆమె చెప్పుకొచ్చింది. తాను రాజకీయాలనైనా వదిలేస్తాను కాని పార్టీ మారను అంటూ గతంలో కూడా ఈమె ప్రకటించింది.