సక్సెస్‌ కాకున్న ఛాన్స్‌ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన నాని

చిలసౌ చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్‌ కాకున్నా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌. చిలసౌ తీసిన విధానం నచ్చి ‘మన్మధుడు 2’ చిత్రం చేసే అవకాశంను రాహుల్‌ రవీంద్రన్‌కు నాగార్జున ఇచ్చిన విషయం తెల్సిందే. మన్మధుడు 2 చిత్రం ఫలితం నిరాశ పర్చింది. ఒక మోస్తరు ఎంటర్‌టైనర్‌గా టాక్‌ దక్కించుకున్నా కూడా సినిమాలో కాస్త సాగతీత ఎక్కువ అయ్యిందని, ఏదో తేడా కొట్టింది అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మన్మధుడు 2 చిత్రం ఫలితం తేడా కొట్టినా కూడా రాహుల్‌ రవీంద్రన్‌కు మూడవ ఛాన్స్‌ దక్కింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాహుల్‌ మూడవ సినిమాను నాని హీరోగా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. నాని ప్రస్తుతం ‘గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రం ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రం విడుదలైన తర్వాత నాని చేయబోతున్న సినిమా ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది. ‘వి’ లో విలన్‌గా నాని కనిపించబోతున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని విలన్‌గా నటిస్తున్నాడు. ఆ తర్వాత రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో నాని ఒక చిత్రంను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్‌ ఆ స్క్రిప్ట్‌ పనిలో పడ్డాడట. మరి ఎప్పుడు సినిమా మొదలయ్యేనో చూడాలి.