ప్రభాస్ సాహో చిత్రం మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా ఈ చిత్రం గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. బాహుబలి 2 చిత్రం విడుదలైనప్పటి నుండి కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక కుర్ర దర్శకుడు సుజీత్‌కు ఇంత పెద్ద ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పగించిన యూవీ క్రియేషన్స్ నిర్మాతల ఘట్స్కు మెచ్చుకోవాలంటూ అంతా ప్రశంసిస్తున్నారు. ఇలాంటి సమయంలో సాహో చిత్రం బాహుబలి 2 చిత్రం కలెక్షన్స్ క్రాస్ చేస్తుంది అంటూ కొందరు ప్రచారం చేయడం ఆశ్చర్యంగా ఉంది.
బాహుబలి 2 అనేది అద్బుతం. ఈ విశ్వంలో అద్బుతాలు ఎప్పుడు జరగవు. చాలా రేర్‌గా జరుగుతాయి. అలాంటి అద్బుతం ప్రభాస్‌కు వరుసగా రెండు సార్లు జరుగుతుందని ఏ ఒక్కరు అనుకోవడం లేదు. ఖచ్చితంగా సాహో చిత్రం బాహుబలి 2 కలెక్షన్స్‌ను చేరదని అంటున్నారు. అయితే సాహో చిత్రం ‘బాహుబలి’ మొదటి పార్ట్ కలెక్షన్స్‌ను బ్రేక్ చేస్తే చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. రాజమౌళి సినిమా కలెక్షన్స్‌ను బ్రేక్ చేసిందని సాహోకు మంచి పేరు దక్కడం ఖాయం. అయితే బాహుబలి మొదటి పార్ట్ కలెక్షన్స్‌ను కూడా ‘సాహో’ రాబట్టడం కష్టం అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏ స్థాయిలో వసూళ్లు చేస్తుందో ఆగస్టు 30తో వెళ్లడి కానుంది.