జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వడంతో పాటు ఆ రాష్ట్రంకు ప్రత్యేక రాజ్యాంగం కలిగి ఉండే అర్హతను ఇస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ జమ్మూ కాశ్మీర్‌ను కూడా ఇండియాలో పూర్తి భాగంగా మార్చడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కొందరు మద్దతు తెలుపుతుంటే మరి కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
ఇక బాలీవుడ్ సినీ ప్రముఖులు దాదాపుగా అంతా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ట్వీట్స్ చేశారు. ఈ సందర్బంగా బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా మోడీ మరియు అమిత్ షాల సాహస నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ ఇది సాహసోపేత నిర్ణయం అని, మోడీ మరియు అమిత్ షాలకే ఇది సాధ్యం అయ్యింది అంటూ ప్రశంసలు కురిపించారు. కేవలం బాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాకుండా ఇంకా ఇతర భాషల ప్రముఖులు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్దిస్తున్నారు. ఒక దేశం.. ఒకే రాజ్యాంగం అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.