సన్నీలియోన్ ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఏ స్థాయి క్రేజ్‌ను కలిగి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె తాజాగా ‘అర్జున్ పాటియాలా’ అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో తన ఫోన్ నెంబర్ అంటూ ఒక ఫోన్ నెంబర్‌ను చెప్పింది. అది సినిమా సీన్‌లో భాగంగా వస్తుంది. అయితే ఆ ఫోన్ నెంబర్ ర్యాండమ్‌గా చెప్పేసింది. అది ఎవరిది, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటీ అనే విషయాలను ఆమె కాని దర్శకుడు కాని పట్టించుకోలేదు. ఆ నెంబర్ సన్నీలియోన్‌ది అంటూ సదరు నెంబర్‌కు రోజుకు 200 మంది వరకు కాల్ చేస్తున్నారట. దాంతో ఆ నెంబర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.
నా నెంబర్‌ను అనుమతి లేకుండా సినిమాలో వాడటం జరిగిందని, ఆ కారణంగా నాకు ప్రతి రోజు ఎంతో మంది సన్నీలియోన్ ఉందా అంటూ కాల్ చేస్తున్నారు అంటూ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ కాల్స్ వల్ల నా బిజినెస్ కూడా నాశనం అవుతుందంటూ ఢిల్లీకి చెందిన పునీత్ తీవ్ర ఆవేదనతో చెప్పుకొచ్చాడు. దాంతో చిత్ర యూనిట్ సభ్యులు స్పందించారు. అతడికి క్షమాపణలు చెప్పడం జరిగింది. సన్నీలియోన్ కూడా సారీ చెప్పింది. మీకు కలిగిన అసౌకర్యంకు విచారం వ్యక్తం చేస్తున్నామంటూ ట్వీట్ చేసింది.