ప్రభాస్‌ రెమ్యూనరేషన్‌ అందులో 50%

బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌ ఆల్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ అయ్యాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. అందరి అంచనాలను అందుకునేలా సాహో ఉంటుందని అంటున్నారు. సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు, ప్రభాస్‌ సన్నిహితులు అయినా వంశీ మరియు ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు.

దాదాపుగా 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రంను హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ప్రభాస్‌ ఈ చిత్రం కోసం ఎంత పారితోషికం తీసుకుని ఉంటాడు అంటూ ఒక చర్చ మొదలైంది. నిర్మాతలు సన్నిహితులు అవ్వడం వల్ల సినిమా సొంతం అయ్యి ఉంటుంది. కనుక పారితోషికం విధానం కాకుండా లాభాల్లో వాట మాదిరిగా తీసుకుని ఉంటాడు అంటూ సమాచారం అందుతోంది. ఈ చిత్రంకు పెట్టిన బడ్జెట్‌ తీసివేయగా ఎంత వస్తే అందులో సగం ప్రభాస్‌ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే నిజం అయితే ప్రభాస్‌కు వంద కోట్లకు పైగానే పారితోషికం రూపంలో వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.