నాగార్జున హీరోగా దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన మన్మధుడు చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు మన్మధుడు 2 చిత్రంలో నాగార్జున నటించాడు. ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధం లేదు. అయినా కూడా టైటిల్ కారణంగా సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈమద్య కాలంలో నాగార్జున నటించిన ఏ సినిమాపై కూడా ఈ స్థాయి అంచనాలు లేవు. కాని ఈ చిత్రంపై మాత్రం చాలా ఆసక్తిని ప్రేక్షకులు కనబర్చుతున్నారు. దాంతో బయ్యర్లు కూడా ఈ సినిమాను భారీ మొత్తాలకు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడు పోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
బాహుబలి చిత్రం తర్వాత హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో తెలుగు సినిమాలకు భారీగా డబ్బు వచ్చి చేరుతుంది. కొన్ని సినిమాలకు లక్ బాగా కలిసి వస్తుంది. మన్మధుడు 2 చిత్రాన్ని హిందీ బయ్యర్లు ఏకంగా 6.3 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. హిందీ థియేట్రికల్ మరియు శాటిలైట్ రైట్స్ ను 6.3 కోట్లకు ప్రముఖ పంపిణీదారుడు కొనుగోలు చేయడం జరిగింది. అక్కినేని హీరో ఇంత భారీ మొత్తంలో ఉత్తరాదిన బిజినెస్ చేయడం ఇదే ప్రథమం అని చెప్పుకోవాలి. నాగార్జున కూడా యంగ్ స్టార్ హీరోలకు పోటీగా తన సినిమాను విడుదల చేయబోతున్నారు. మన్మధుడు 2 చిత్రం మొత్తంగా 60 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉంది. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా రకుల్ నటించిన విషయం తెల్సిందే.