కన్నడ సినీ పరిశ్రమను షేక్ చేసి బాలీవుడ్లో సైతం మంచి వసూళ్లను దక్కించుకున్న చిత్రం ‘కేజీఎఫ్’. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నిల్ తెరకెక్కించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈయన యష్‌తో కేజీఎఫ్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నిల్ వచ్చే ఏడాది ఆ సినిమాను విడుదల చేయబోతున్నాడు. ఆ తర్వాత తెలుగులో మైత్రి మూవీస్ బ్యానర్లో ఒక చిత్రాన్ని చేసేందుకు ఈయన అగ్రిమెంట్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఆ సినిమా ఎన్టీఆర్‌తో ఉండబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి.
తాజాగా ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమా అంటూ మరో పుకారు షికారు చేయడం మొదలు పెట్టింది. తాజాగా ఎన్టీఆర్‌కు ప్రశాంత్ నిల్ స్టోరీ లైన్ వినిపించాడని, తన టీంతో స్క్రిప్ట్ వర్క్ కూడా చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది డాన్స్ ప్రధానంగా సాగే చిత్రం అని, అందుకోసం ఎన్టీఆర్ అయితే బాగుంటుందని ఆయన భావించాడట. ప్రస్తుతం ప్రశాంత్ నిల్ టీంతో కలిసి ఎన్టీఆర్ సన్నిహితులు కథ చర్చల్లో పాల్గొంటున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం పూర్తి అయిన తర్వాత ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఉండే అవకాశం ఉంది. డాన్స్‌లు ఇరగదీసే ఎన్టీఆర్ ఈ చిత్రంతో మరింత డాన్స్‌లను ప్రేక్షకులకు చూపించే అవకాశం ఉంది.