హైకోర్టు ఆదేశాలు పట్టని తెలంగాణా సర్కార్ !

తెలంగాణా సర్కారు కోర్టు ఆదేశాలు ఖాతరు చేస్తున్నట్టు లేదు. తమ ఆదేశాలు లేకుండా సెక్రటేరియట్ కూల్చకూడదని చెప్పినా అవేమీ పట్టనట్టు తెలంగాణ సచివాలయం తరలింపునకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సచివాలయంలోని కార్యాలయాలను బూర్గుల రామకృష్ణారావు భవన్ (బీఆర్ కే) కు తరలించాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించింది.

ఈ సమావేశంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు. బీఆర్ కే భవన్ కనుక సరిపోకపోతే ఇక్కడికి సమీపంలోని ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు కొన్ని శాఖలు తరలించాలని నిర్ణయించింది. అటవీశాఖను అరణ్య భవన్ లోకి, ఆర్ అండ్ బీ శాఖను ఎర్రమంజిల్ కు, మిగిలిన శాఖలన్నింటిని బీఆర్ కే భవన్ కు తరలించనున్నారు. ఇక రెండు వారాల్లో తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.

అలాగే తెలంగాణలో కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణ అంశాల మీద కూడా వర్గ ఉపసంఘం సమీక్షించింది. సచివాలయం, అసెంబ్లీ భవనాల స్థితిగతులపై అధ్యయనానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఇంజనీర్ ఇన్ చీఫ్ లతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్ అండ్ బీ అధికారి గణపతిరెడ్డి కన్వీనర్ గా వ్యవహరించనున్న ఈ కమిటీలో సభ్యులుగా రవీందర్ రావు, మురళీధర్, సత్యనారాయణరెడ్డి ఉన్నారు. ప్రస్తుత సచివాలయం, అసెంబ్లీ భవనాల స్థితిగతులపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. దానిని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.