27న తెలంగాణ ప్రకటన?

telanganaతెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసిందా! అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. టీ కాంగ్రెస్ నేతల వాదనలను మరోసారి విన్న హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఓ నివేదికను సోనియాకు అందజేయచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగానే సోనియా రాష్ట్ర విభజన అంశంపై ఓ నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని తెలుస్తోంది. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో తెలంగాణకు అనుకూలంగా చేసిన తీర్మానాన్ని టీ ఎంపీలు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. షిండే ఈ అంశాన్ని కూడా తన నివేదికలో చేర్చినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల ద్వారా హోంశాఖా మంత్రి షిండే తయారు చేసిన నివేదికలో సోనియా ముందు ఐదు అంశాలను ఉంచనున్నట్టు సమాచారం. ఆ అయిదు అంశాలు ప్రధాన్యత పరంగా చూస్తే…

1) రాష్ట్రాన్ని విభజించడం: 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తామని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణవాదులు రాష్ట్రం కోసం ఆందోళన చేస్తూనే ఉన్నారు. దీంతో సోనియా కూడా ఈ ఆందోళనలను గుర్తించినట్టు తెలుస్తోంది.

2) గూర్ఖాల్యాండ్ తరహా కౌన్సిల్ : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో గూర్ఖాల్యాండ్ రాష్ట్ర ఏర్పాటుకు విరుగుడుగా కేంద్రం సూచించిన స్వయం పాలక మండలిని ఇక్కడ కూడా ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి.

3) తెలంగాణ కు ప్రత్యేక మండలి, బోర్డు, నిధులు: ఇక మూడో ప్రతిపాదనలో భాగంగా తెలంగాణకు ప్రత్యేక అభివృద్ధి మండలితోపాటు బోర్డు, నిధులు ఇవ్వడం.

4) రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం: తెలంగాణపై ఏకాభిప్రాయం కావాలని సాకుతో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయమనే అవకాశం ఉంది.

5) రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం: సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, ఎంపీలు, మంత్రులు డిమాండ్ చేస్తున్నట్టుగా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచడం.

అయితే తెలంగాణపై ఏదో ఒక ప్రకటన ఈనెల 27న మధ్యాహ్నంలోపు వెలువడనుందని తెలుస్తుంది. అనంతరం షిండే 27 నుండి మూడు రోజుల బంగ్లాదేశ్ లో పర్యటించనున్న సందర్బంగా అంతకు ముందే నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. తెలంగాణపై నిర్ణయం ఎలా ఉంటుందనే విషయంపై అనేక ఊహగానాలున్నప్పటికిని కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికే మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమవుతుంది. చివరగా ఈనెల 25న మన్మోహన్ సింగ్ నివాసంలో సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశమై తెలంగాణ విషయంపై మరోసారి చర్చించి తుదినిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడుతుందా లేదా అనే తెలియాలంటే ఈ నెల 27 వరకు వేచిచూడాల్సిందే మరి.