చెర్రి, బన్నీ, తారక్… డాన్సింగ్ స్టార్ ఎవరు?

charan ntr allu arjunఫ్యాన్స్ ని ఎలా ఖుష్ చేయాలో మన హీరోలకు బాగా తెలుసు. ఏం చేస్తే… అభిమానులు సంబరాలు చేసుకొంటారో వాళ్లకెప్పుడో అర్థమైంది. ఫైట్లతో తుక్కు రేగ్గొట్టాలి. మాటలతో తూటాలు పేల్చాలి… ఇక డాన్సుల విషయంలో విజృంభించేయాలి అనే లెక్కలు సినిమా మొదలెట్టకముందే వేసుకొంటున్నారు. అందుకే ఈ విభాగాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారు. డాన్సుల విషయంలో అయితే ఇక చెప్పక్కర్లేదు. పాటకో కొత్త స్టెప్పు పరిచయం చేస్తున్నారు. ‘ఇలాక్కూడా డాన్స్ చేయొచ్చా?’ అని సగటు అభిమానులు ముక్కుమీద వేలు వేసుకొనేలా చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో డాన్స్ పేరెత్తితే… ముగ్గురి గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. వాళ్లే రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.

salman aamir rosanమనం ప్రతిదానికీ బాలీవుడ్ తో పోల్చుకొంటుంటాం. కథ, కథనాలు, యాక్షన్ ఎపిసోడ్ లు తెరకెక్కించే విధానం, టేకింగ్, బడ్జెట్లూ, వసూళ్లూ  గట్రా… ఇలా అన్ని విషయాల్లోనూ హిందీ సినిమాలతో పోలిక తీసుకొస్తాం. ఒక్క డాన్స్ విషయంలో మాత్రం బాలీవుడ్ ని మించిపోయింది  తెలుగు చిత్ర సీమ. అక్కడ చూడండి… ఒక్క హృతిక్ రోషన్ సినిమా మినహాయిస్తే… అమీర్ ఖాన్ కథలపై పెట్టిన దృష్టి ఇలాంటి కమర్షియల్ విలువలపై పెట్టడనే విషయం జగమెరిగిన సత్యం. షారుఖ్, సల్మాన్ ల నుంచి అదరగొట్టే డాన్సింగ్ భంగిమలు ఆశించడం పొరపాటే. తెలుగులో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. కొత్తగా అడుగు పెడుతున్న కథానాయకుడితో సహా.. ప్రతి ఒక్కరూ డాన్సింగ్ టాలెంట్ ఉన్నవాళ్లే. వారిలో ది బెస్ట్ ఎవరు? అని ప్రశ్నించుకొంటే ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ పేర్లు వినిపిస్తాయి. ఇంతకీ ఈ ముగ్గురిలో ది బెస్ట్ ఎవరు అనేదే ఇప్పుడు అభిమానుల ప్రశ్న.

ram-charan-teja-latest-dancing-తెలుగు చిత్ర సీమలో డాన్స్ ల గురించి ప్రస్తావించుకొంటే తప్పకుండా వినిపించే పేరు చిరంజీవి. సరికొత్త స్టెప్పులతో ప్రేక్షకుల్ని సీట్లలో కూర్చోబెట్టిన ఘనత ఆయనది. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున కూడా డాన్సులు చేశారు. కానీ… చిరంజీవిదో ప్రత్యేక ముద్ర. చిరుని స్పూర్తిగా తీసుకొని నవతరం రెచ్చిపోతోంది. తండ్రి వారసత్వాన్ని అక్షరాలా పుణికిపుచ్చుకొన్నాడు చరణ్. తొలి సినిమా ‘చిరుత’తోనే తన డాన్సింగ్ టాలెంట్ ని బయట పెట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకొన్నాడు. ‘మగధీర’లో బంగారు కోడి పెట్ట పాటలో.. ఔరా అనిపించాడు. అభిమానుల మాటల్లో చెప్పాలంటే ‘చిరంజీవిని మించి పోయాడు’. ‘రచ్చ’, ‘ఆరెంజ్’ సినిమాల్లోనూ ఇదే దూకుడు చూపించాడు. ‘నాయక్’లోనూ డిటోనే.

dancing-allu-arjunమెగా కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో అల్లు అర్జున్ కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ‘గంగోత్రి’లో డాన్సులు చేసే అవకాశం రాకపోయినా.. ‘ఆర్య’తో తుక్కు రేగ్గొట్టాడు. ‘బన్నీ’, ‘హాపి’, ‘దేశముదురు’… ఇలా ప్రతి సినిమాలోనూ తనదైన ముద్ర చూపించాడు. ‘ఆర్య 2’లో బన్నీ చేసిన డాన్స్ మూమెంట్స్ అబ్బుర పరచాయి. డాన్స్ చేశాడా? లేదంటే స్పెషల్ ఎఫెక్ట్సా…? అనుకొనేంత అద్భుతంగా కుదిరాయి. ‘బద్రీనాథ్’, ‘జులాయి’ సినిమాల్లోనూ ఏమాత్రం తగ్గలేదు.

dammu-dancing-stillsఈ మెగా హీరోలకు పోటీ ఉందంటే… అది ఎన్టీఆర్ నుంచే. చిన్నప్పుడే శాస్తీయ నృత్యం నేర్చుకున్న తారక్ కి.. డాన్సులు అలవోకగా అబ్బేశాయి. ఎంతకష్టమైన మూమెంట్ అయినా చాలా ఈజ్ తో ఈజీగా చేసేస్తాడు. ప్రేమ్ రక్షిత్ లాంటి వర్థమాన డాన్స్ మాస్టర్లకు క్రేజ్ తీసుకొచ్చింది ఎన్టీఆరే. ప్రేమ్ రక్షిత్-ఎన్టీఆర్ కలయికలో వచ్చిన పాటలన్నీ డాన్స్ పరంగా కొత్త లుక్ సృష్టించుకొన్నాయి. ‘యమదొంగ’, ‘అదుర్స్’, ’కంత్రి’ లలో తారక్ వేసిన స్టెప్పులు ‘నభూతో నభవిష్యత్‌’ అన్నట్టు కుదిరాయి. రాబోతున్న ‘బాద్ షా’లోనూ తారక్ డాన్సింగ్ విషయంలో కొన్ని సాహసాలు చేయబోతున్నాడట. అవేంటో చూడాలి.

pavan charan ram maheshపవన్ కల్యాణ్ కూడా మంచి డాన్సరే. ‘ఖుషి’ సినిమాలోని కొన్ని పాటలకు ఆయనే డాన్స్ మాస్టర్. అయితే ఆయన స్టెప్పులన్నీ చాలా సహజంగా ఉంటాయి. మహేష్ బాబు, ప్రభాస్ లు .. ఈ విభాగాన్ని కాస్త నిర్లక్ష్యం చేశారు. అయితే డాన్స్ విషయంలోనూ తాము తీసిపోమని ఈమధ్యే నిరూపించుకొంటున్నారు. ‘రెబల్’లో ప్రభాస్ డాన్స్ విషయంలోనూ రెచ్చిపోయాడు. రామ్ నృత్యాల గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. తన ‘ఎనర్జీ’ని నూటికి నూరుపాళ్లు డాన్సుల్లో చూపిస్తున్నాడు.

బన్నీ, చరణ్, ఎన్టీఆర్ ఇప్పటికే నిరూపించుకొన్నారు. ప్రతి సినిమాకీ ఓ కొత్త తరహా భంగిమ పరిచయం చేయాలని ఉబలాటపడుతున్నారు. ప్రత్యేకంగా డాన్సుల కోసం రిహార్సల్స్ చేస్తున్నారు. వీరి తాపత్రయం అటు దర్శకులనీ, ఇటు నిర్మాతలన్నీ సైతం మెప్పిస్తోంది. వీరిలో ఎవరు డాన్సింగ్ స్టార్..? అనే విషయం తేల్చడం కష్టం. ముగ్గురూ ముగ్గురే. సినిమాకొచ్చిన ప్రేక్షకుడి చేత చప్పట్లు కొట్టించుకొంటున్నారు. వీరి దూకుడు ఇలాగే కొనసాగాలని.. మరిన్ని పాటల్ని కనుల విందుగా మార్చాలని కోరుకొంటున్నాం.