మధ్యతరగతిపై భారీ వరాలు

మోడీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ లో మధ్యతరగతిపై భారీ వరాలు కురిపించింది. ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. పొదుపు, పెట్టుబడులతో కలిపి రూ.6.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు.

స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితి రూ. 40 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. పోస్టల్‌, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్‌ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీడీఎస్‌ పరిమితి రూ. 10 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్‌ గోయల్‌ బడ్జెట్‌లో ప్రకటించారు. మొత్తానికి.. ఎన్నికల ముందు జనాకర్షక బడ్జెట్ ని తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం.