వెన్నెలతో మ్యాజిక్ చేసిన కిషోర్ తరువాత కమెడియన్ గా రాణించినప్పటికీ దర్శకత్వం విషయంలో మాత్రం తొలి ప్రయత్నమైన “వెన్నెల 1 1/2” తో ఘోర వైఫల్యం చవిచూశాడు. తన ద్వితీయ ప్రయత్నంగా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో “జఫ్ఫా” అన్న కామెడీ చిత్రాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. కొద్ది నెలల క్రితమే దాదాపుగా చిత్రం మొత్తం రెడీ అయిపోయినప్పటికీ ఎందుకనో రిలీజ్ కాకుండా ఉండిపోయింది. అప్పట్లో ఖైదీ డ్రెస్ లో బ్రహ్మానందం కనిపించిన “జఫ్ఫా” చిత్రం ట్రైలర్ కూడా జనాలను బాగానే మెప్పించింది. అయితే ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోకపోవడానికి ఈ సినిమా బిజినెస్ కాకపోవడమే కారణమని ఓ సమాచారం. ఇటీవలే విడుదలైన “నాయక్” చిత్రంలోని బ్రహ్మానందం క్యారెక్టర్ “జిలేబీ” బాగా జనాల్లోకి ఎక్కేయడంతో ఆ వేడిలోనే ఈ జఫ్ఫాను విడుదల చేసెయ్యడం మంచిదని సినిమా నిర్మాణ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. మరి ఈ ద్వితీయ ప్రయత్నమైనా మరి కిషోర్ జీవితంలో వెన్నెల కురిపిస్తో లేదో వేచి చూడాలి.