ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ప‌రిష్కరించాలి : జనసేనాని


ఆర్టీసీ కార్మికుల న్యాయ‌మైన‌ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించి వారు త‌ల‌పెట్టిన‌ స‌మ్మెను నివారించాల‌ని జ‌న‌సేన పార్టీ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఫిబ్ర‌వ‌రి 6 నుంచి నిర‌వ‌ధిక స‌మ్మెకు దిగ‌నున్న‌ట్టు కార్మిక సంఘాలు నోటీసు ఇచ్చిన నేప‌ధ్యంలో వారి డిమాండ్ల ప‌ట్ల ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవ‌స‌రం ఉంది. కార్మికుల ప్ర‌ధాన డిమాండ్ల‌లో న్యాయ‌మైన వాటిని ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించాలి. 52 వేల మంది కార్మికులు, వారి కుటుంబాల‌తో ముడిప‌డివున్న ఈ స‌మ‌స్య‌ను మాన‌వీయ కోణంలో అర్ధం చేసుకోవాల్సి ఉంది. ఆర్టీసీ స‌మ్మె సామాన్య ప్ర‌జ‌ల జీవ‌నం మీద తీవ్ర‌మైన ప్ర‌భావం చూపే ప‌రిస్థితులు ఉన్నందున, సాధార‌ణ జీవ‌నానికి ఎటువంటి ఆటంకం క‌ల‌గ‌ని విధంగా స‌మ్మెను నివారించ‌డానికి ప్ర‌భుత్వం త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌న‌సేన పార్టీ డిమాండ్ చేస్తోంది. త‌మ ఆందోళ‌న‌ల‌కి మ‌ద్ద‌తు ప‌ల‌కాల్సిందిగా ఆర్టీసీ కార్మిక సంఘాలు జ‌న‌సేన పార్టీకి విన‌తిప‌త్రాన్ని ఇచ్చాయి. న్యాయ‌మైన కొర్కెల ప‌రిష్కారానికి చేస్తున్న పోరాటంలో కార్మికుల‌కు జ‌న‌సేన శ్రేణులు అండ‌గా నిల‌బ‌డాల‌ని శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు పిలుపునిచ్చారు.