జనసేన, కమ్యూనిస్టు పార్టీల అగ్రనాయకుల సమావేశానికి విశాఖ వేదిక కానుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు విశాఖ నగరం రుషి కొండలో ఉన్న సాయిప్రియా రిసార్ట్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన, సిపిఎం, సిపిఐ పార్టీలు కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జనసేన, వామపక్షాల మధ్య జరిగిన పలు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అగ్రశ్రేణి నేతలు మాత్రమే పాల్గొన్నారు. శుక్రవారం జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో జాతీయ స్థాయిలో వామపక్ష పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిపిఐ జనరల్ సెక్రటరీ శ్రీ సురవరం సుధాకర్‌రెడ్డి గారు, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీ రాఘవులు గారు తొలి సారిగా అధికారికంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్ గారిని కలవనున్నారు. జనసేన, వామపక్షాల మధ్య నెలకొన్న స్నేహబంధం భవిష్యత్తులో మరింత విస్తృత పర్చడానికి, జనసేన మూల సిద్ధాంతాలలో సారుప్యత కలిగిన అంశాలను ముందుకి తీసుకెళ్లడానికి గల అవకాశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
ఈ సమావేశంలో జనసేన తరుపున పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ పూర్వపు ఉమ్మడి శాసనసభ స్పీకర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో పాటు కొందరు ముఖ్యనేతలు పాల్గొంటారు. సిపిఎం తరుపున పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీ రాఘవలు గారు, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి శ్రీ మధు గారు, శ్రీయుతులు ముప్పాళ్ల నాగేశ్వరరావు గారు, సత్యనారాయణ మూర్తి గారు, జల్లి విల్సన్ , సిపిఐ నుంచి ఆ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ సురవరం సుధాకర్‌రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి శ్రీయుతులు రామకృష్ణ గారు, ఎ.శ్రీనివాసరావు గారు, వై.వెంకటేశ్వరరావు గారు, సిహెచ్ నర్సింగరావుగారు ఈ సామావేశంలో పాల్గొంటారు.