డిసెంబర్ 2వ తేదీన అనంతపురం వేదికగా జనసేన పార్టీ భారీ కవాతు నిర్వహించనుంది. ఈ కవాతుతో రాయలసీమలో జనసేన పోరాట యాత్ర ప్రారంభమవుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్ గారి పోరాట యాత్ర గురువారం(నవంబర్ 29)తో ముగుస్తుంది. అనంతరం రాయలసీమలో ఆయన అడుగు పెడతారు. కవాతుతో తన తొలి అడుగు వేయనున్నారు. సీమ అనావృష్టి-కరువు పరిస్థితుల్ని ప్రభుత్వం, ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా శ్రీ పవన్‌కళ్యాణ్ గారు ఈ కవాతు నిర్వహించనున్నారు. అనంతపురంలోని గుత్తి రోడ్డులోని మార్కెట్ యార్డు వద్ద నుంచి క్లాక్ టవర్ వరకు కవాతు సాగనుంది. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో శ్రీ పవన్‌కళ్యాణ్ గారు ప్రసంగిస్తారు.
కవాతుకి సంబంధించిన కార్యాచరణకి శ్రీ పవన్‌కళ్యాణ్‌గారు ఆమోదం తెలిపారు. ఇప్పటికే చురుగ్గా ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. జనసేన ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కవాతులో లక్షలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని జనసైనికులని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోరింది. సీమలో తీవ్ర వర్షాభావం, కరువు నేపధ్యంలో రైతులని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విషయాన్ని స్థానిక జనసేన శ్రేణులు పలు మార్లు శ్రీ పవన్‌కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో రాయలసీమ పోరాట యాత్రని కరువుపై పోరాటంతో ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. కవాతు అనంతరం శ్రీ పవన్‌కళ్యాణ్ గారు కొన్ని రోజులు అనంతపురం జిల్లాలోనే ఉండి కరువు పరిస్థితులపై అధ్యయనం చేస్తారు.