* భూసేకరణతో కుల ఘర్షణలకు ఆస్కారం ఇస్తున్నారు
* సేకరించిన భూములకు బ్యాంకుల్లో తనఖాపెడుతున్నారు తప్ప… ఉద్యోగాలు ఇవ్వడం లేదు
* జగన్ జైలుకెళ్లింది స్వతంత్ర పోరాటంలోనో హక్కుల సాధనలో కాదు – అక్రమాస్తుల కేసులో
* రాబోయేది జనసేన పాలన
* అమలాపురం బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
వేలకోట్ల ప్రకృతి సంపదను దోచుకుంటున్న ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల అవినీతిపై మాట్లాడే దమ్ము, ధైర్యం రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీకిగానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడికి గానీ లేదని, ఆ దమ్ము, ధైర్యం కేవలం జనసేన పార్టీకి మాత్రమే ఉన్నాయని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారు పేర్కొన్నారు. గ్యాస్ బ్లో అవుట్ లో కాలిపోయిన బిడ్డలను చూస్తే గుండె బరువెక్కిందని, ఇప్పటికీ వాళ్లకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ప్‌ామాదం ఆయిల్ కంపెనీ వాళ్ల పిల్లలకో, తెలుగుదేశం పార్టీ నాయకుల పిల్లలకో జరిగితే ఊరుకుంటారా..?. రక్తపాతం మాకు, అభివృద్ధి మీకా అని ప్రశ్నించారు. అంబానీలను అడగాలంటే మన రాజకీయ నాయకులకు భయం. కోట్లు కొల్లగొడుతున్న రిలయన్స్ గానీ, ఓఎన్జీసీ గానీ, గుజరాత్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలనుగానీ ఒక్క మాట కూడా ప్రశ్నించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం చస్తేగానీ ఈ దుర్మార్గులకు మనసు కరగదని దుయ్యబట్టారు. పోరాటయాత్రలో భాగంగా గురువారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో బహిరంగసభ నిర్‌యహించారు. ఈ సభకు పెద్ద ఎత్తున జనసైనికులు, అభిమానులు హాజరయ్యారు. సత్యనారాయణ ఫంక్షన్ హాల్ నుంచి అమలాపురంలోని సభాస్థలికి వరకు జనసేనానిని భారీ ర్యాలీతో తీసుకొచ్చారు. పూలు, హారతులతో నీరాజనాలు పడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ వేదిక నుంచి శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ.. “ఆయిల్ కంపెనీల అవినీతిపై ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం అంటే స్కాముల్లో ఇరుకున్న వ్యక్తి. 9 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. గాంధీలా స్వాతంత్ర పోరాటంలోనో, మండేలాలా నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడి జైలు కెళ్తే ఒక పద్దతి. లక్ష, లక్షన్నర కోట్లు అక్రమాస్తులు కూడగట్టారని జైలుకు పంపించారు. ఇప్పటికీ ఆ కేసులు వెంటాడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే.. మాట తేనె, మనసు విషం. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచాడని తెలిసినా విభజన సమయంలో అనుభవజ్ఞుడు అని నమ్మి ఏమీ ఆశించకుండా మద్దతు ఇచ్చాను. తప్పులు మీద తప్పులు చేసినా సరిదిద్దుకుంటారని మూడున్నరేళ్లు ఎదురుచూశాను. అయినా మారలేదు సరికదా ఇంకా ఎక్కవ తప్పులు చేశారు. ప్రభుత్వ మహిళా అధికారిణిని జట్టుపట్టుకుని ఒక రౌడీ ఎమ్మెల్యే కొడితే వాడిని సస్పెండ్ చేయాల్సింది పోయి, ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారు. 2014లో ఏమీ ఆశించకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తే జనసేన మీటింగ్ లకు వెళ్తున్న జనసైనికులపై తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. టీడీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాను, చాలా మంది రాజకీయ నాయకులను మీరు చూసుండొచ్చు. కానీ నాలాంటి వాడిని చూసుండరు. 2019లో తెలుగుదేశం పార్టీ అవినీతి కోటల్ని బద్దలు కొట్టి, కూలదోస్తాం.
మంత్రి లోకేశ్ తాతగారి లాగా మా తాత ముఖ్యమంత్రి కాదు. ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి తండ్రిలా మా నాన్న ముఖ్యమంత్రి కాదు. మా నాన్న చిన్నపోలీస్ కానిస్టేబుల్ . మానవత్వం ఎక్కడ మంటగలుస్తుందో, మనుషులు ఎక్కడ దోపిడికి గురవుతారో అక్కడ పీడిత వర్గాల పక్షాన అండగా నిలబడాలన్న చెగువేరా స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. నీరు, నిధులు దోచేశారని, యాస, భాషలను అవమానించారని తెలంగాణ నాయకులు ఆంధ్రోళ్లను తిడుతుంటే ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడలేదు. ఏపీ ఉద్యోగులు పదేపదే వివక్షకు గురవుతున్నా అడిగే దమ్ము ధైర్యం లేక దద్దమ్మల్లా మౌనంగా కూర్చొన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వారు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి ఎలా అవుతారు..? ఆనాడు తెలంగాణకు అన్యాయం చేసింది పాలకులు తప్ప ప్రజలు కాదని, ప్రజల్ని తిడితే తాటతీస్తానని ధైర్యంగా నిలబడింది జనసేన పార్టీ ఒక్కటే. ఆంధ్రుల ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కులు కాపాడటానికే పార్టీ పెట్టాను. దీని కోసం చచ్చిపోవడానికైనా సిద్ధం. జనసేన పార్టీకి అ అంటే అమలాపురం, అనంతపురం అయితే టీడీపీకి మాత్రం అ అంటే అమరావతి మాత్రమే.
* సీఎం, జగన్ లకు ఎందుకంత భయం?
లోకేష్ లా సైకిల్ తొక్కడం, జగన్ లా బుగ్గలు నిమరడం, చంద్రబాబులా నన్ను మరోసారి సీఎం చేయండి అనడం కాదు ప్రజల తరఫున నిలబడాలి. మాట్లాడితే మాది రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ అంటారు, ఉడుకు రక్తం అంటారు. మరి రిలయన్స్ అంబానీని పిలిచి ఎందుకు మాట్లాడలేరు. భయమా? ధైర్యంగా మాట్లాడండి. ప్రతి రోజూ, ప్రతి ఒక్కరికీ భయపడటమేనా? బలంగా మాట్లాడలేరు వీళ్ళు. కర్ర విగరకుండా, పాము చావకుండా మాట్లాడుతుంటారు. రెండు కళ్ళ సిద్దాంతం, ఆరు చేతుల ఆలోచనలు, విజన్ 2020 , 2050 అంటారు. సీఎం విజన్ డబ్బు సంపాదించడమే. జగన్ కోడి కత్తి గుచ్చుకోగానే… గుచ్చేశారు గుచ్చేశారు అని ఓ పెద్ద గగ్గోలు చేశారు. కోడి కత్తి గుచ్చుకొందని కంప్లైన్ట్ చేయవచ్చు కదా. ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటే- కోడి కత్తి గుచ్చుకోగానే జనసేన కార్యకర్త చేశారని టిడిపి మీడియా చూసే వ్యక్తి ప్రచారం మొదలుపెట్టారు. జనసేన అంటే ఏమనుకొంటున్నారు. మనం ఒకేసారి పెద్ద విప్లవం తీసుకొస్తాం. కోనసీమ క్షేమం కోరుకొనేవాడిని నేను. రిలయన్స్ కు భయపడేది లేదు. నన్ను గుండెల్లోపెట్టుకొంటున్న ప్రజల కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తాను.
* బ్రోకర్లు, పైరవీకారులు బాగుపడుతున్నారు
ఇక్కడ ధనవంతుడే మరింత ధనవంతుడు అవుతున్నాడు. పేదవాడు అలాగే ఉండిపోతున్నారు. బ్రోకర్లు, పైరవీకారులు మాత్రం బాగుపడుతున్నారు. ఎంపీలు, మంత్రులు అవుతున్నారు. యువతకు పట్టుమని పది ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు. పైగా మన మీద ఎక్కి తొక్కుతున్నారు. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాను… భూసేకరణ పేరుతో రాజధాని ప్రాంతంలో భూములు లాక్కొంటే ఎదురుతిరుగుతాను అని. ఇలా భూసేకరణలు చేస్తే కులఘర్షణలకి ఆస్కారం ఏర్పడుతుంది. మాట్లాడితే సింగపూర్ తరహా అభివృద్ధి అంటారు. అక్కడ 30 ఎకరాల్లో హోటల్ కత్తి 25 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. మరి ఇక్కడో వేల ఎకరాలు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వరు. ఆ భూముల్ని బ్యాంకుల్లో తనఖాపెట్టేసుకుంటారు. ఇలా చేయడం వల్ల, భాష, యాసలను తక్కువ చేశారని తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం మొదలై, విభజన చోటు చేసుకోండి. ముఖ్యమంత్రి గారు తప్పు చేస్తే ఆయన కులంలో ప్రజలను అనకూడదు. ఆయన తప్పు చేస్తే అయన కులంవాళ్ళు ఏం చేస్తారు.
* ఉపాధి డబ్బులు మహిళలకే
నేను నెల్లూరులో చదువుకొంటున్నప్పుడు మంత్రి నారాయణ గారు ట్యూషన్లు చెప్పేవారు. అలాంటి ఆయన ఈ రోజు గవర్నమెంట్ కాలేజీలను నిర్వీర్యం చేసేశారు. జనసేన ప్రభుత్వం ప్రతి మండలంలో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తోంది. వారికి మంచి విద్య అందిస్తుంది. విద్య, వైద్య రంగాల్లో మెరుగైన సేవలు ఇస్తాం. ఎమ్మెల్యేలకు కాదు డాక్టర్లకు నివాస గృహాలు నిర్మిస్తాం. డాక్టర్లు, టీచర్లను బాగా చూసుకొంటేనే వారు ప్రజలకి మెరుగైన సేవలు ఇస్తారు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వమే వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లేవారు ఎక్కువ. వారి ఇబ్బందులు తీర్చేందుకు తగిన ఆలోచనలు చేస్తాం. కులాల పేరుతో ఆ కుల నాయకులూ బాగుపడుతున్నారు తప్ప కులం అభివృద్ధి చెందటం లేదు. అన్ని కులాల అభివృద్ధికి చర్యలు తీసుకుని అవసరమైనవారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం.
యువత మార్పు కోరుకొంటోంది. ఆ విషయం నాయకులకు అర్థం కావడం లేదు. జనసేనను యువత, ఆడపడుచులు అర్థం చేసుకుంటున్నారు. ఒకటి చెబుతాను- జగన్ ప్రభుత్వం స్థాపించరు.. తెలుగుదేశానికి టైం అయిపోయింది. వచ్చేది మన పాలనే. పేదలకు ఇప్పటి ప్రభుత్వాలు ఉపాధి హామీ పేరుతో పనులు ఇస్తుంది. కూలీ ఇస్తుంది. ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కునేందుకు మద్యం షాపులు, బెల్టు షాపులు నడుపుతోంది. ఉపాధి డబ్బులు మహిళల ఖాతాలోకి వేస్తాం. మద్యం షాపుల్లో బ్యాంక్ కార్డులు కూడా తనఖాపెడుతున్నారు. ఇలాంటి పనుల్ని చూస్తూ ఊరుకోము. బెల్టు షాపులుపెడితే బెల్టు తీసి కొడతాం” అన్నారు.