• అర్చకుల ఆత్మ గౌరవం కాపాడతాం
• బ్రాహ్మణుల భాష, యాసలను కించపరస్తే కఠిన చర్యలు
• బిజెపీకి హిందూత్వం ఎక్కడుంది?
• బ్రాహ్మణ సంఘాల సమైక్య సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్
నీరు, గాలి, ఆహారం తరవాత ప్రతి కులానికి ఆత్మగౌరవం చాలా ముఖ్యమని, బ్రాహ్మణుల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకుండా జనసేన పార్టీ అండగా నిలబడుతుందని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఎవరో ఎప్పుడో చేసిన తప్పులకు ఇప్పుడు బ్రాహ్మణులను శిక్షించడం, వారిని అపహాస్యం, వెటకారం చేయడం బాధించాయని అన్నారు. బ్రాహ్మణ సమాజం పాత్ర లేకుండా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేది కాదన్నారు. ఆదివారం ఉదయం రాజమండ్రిలోని బీవీఆర్ ఫంక్షన్ హాల్లో అర్చక, పురోహిత, బ్రాహ్మణ సంఘాలతో శ్రీ పవన్ కల్యాణ్ గారు సమావేశమ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణులు శ్రీ పవన్ కల్యాణ్ గారితో తాము ఎదుర్కొంటున్నఇక్కట్లను వివరించారు. అగ్రవర్ణంలో ఉన్న తాము ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకడి ఉన్నామని, లోకాసమస్తా సుఖినో భవంతు అని రోజు తలచే పురోహితులకు సమస్య వస్తే వెనక నిలబడే నాయకుడే లేడని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో అందడం లేదని, తమను నాయకులు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని వాపోయారు.
బ్రాహ్మణుల సంక్షేమానికి ధామాసా పద్దతిలో సంవత్సరానికి రూ.1500 కోట్లు కేటాయించాలని, రాష్ట్రంలోని ప్రధానమైన దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకుల వయోపరిమితి 65 సంవత్సరాలను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలు విన్న అనంతరం శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడారు. “ఈ దేశానికి కులాలు, మతాలు కంటే చాలా బలంగా ఉండాల్సింది ధర్మం. ధర్మో రక్షతి రక్షిత: అని పెద్దలు చెప్పిన మాట మరచిపోరాదు.
నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం నిన్నురక్షిస్తుంది ఆ మాటలే నా జీవితానికి దిశానిర్దేశం చేసింది. ధర్మం చాలా బలమైనది, కఠినమైనది. భారతదేశ సంస్కృతిని, ధర్మాన్ని ఎవరూ మార్చలేరు. వేదాల సారాన్ని నిలబెట్టిన గొప్ప నేల మనది. అలాంటి వేదాలను ఔపోసన పట్టింది బ్రాహ్మణ సమాజం.
కులాలను అడ్డుపెట్టుకుని వ్యక్తులు ఎదుగుతున్నారు తప్ప కులాలు బాగుపడడం లేదు. రాజకీయ నాయకులు చేసిన తప్పులకు కులాలు, మతాలు అంటూ విడిపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నా స్వార్దానికి నేను బతకడం ఇబ్బందనిపించి రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయ నాయకులు చేసే చెత్తా చెదారాన్ని ఊడ్చేయడానికే రెల్లి కులాన్ని స్వీకరించాను. రెండు, మూడు కులాలను నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదు. అన్ని కులాల ఐక్యతే జనసేన లక్ష్యం. లౌకిక దేశం అని చెబుతూ హిందూ మతం మీద అవహేళనగా మాట్లాడటం బాధాకరం. ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చేస్తే దేశం దౌర్భాగ్య స్థితిలో ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి హిందుత్వం ఎక్కడుంది. వాళ్ళది అవకావాద రాజకీయం. రామ మందిరం కడతామని ఇంత కాలం ఎందుకు కట్టలేదు. హిందుత్వాన్ని వెనకేసుకురావడానికి వాళ్లేమి హిందూత్వానికి గుత్తేదారులు కాదు.
చిన్న గుడిలో పూజారి ఎంతో కష్టపడి వేదాలు నేర్చుకుంటుంటే, రాజకీయ నాయకులు మాత్రం జేబులో పాతికకోట్లుంటే చాలు వచ్చి ఎమ్మెల్యే అయిపోతున్నారు. గుంటూరు శేషేంద్ర శర్మను అన్నివర్గాల వారు మా వ్యక్తి కాదని వదిలేసినా మాతరం మాత్రం మా వ్యక్తి అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. జనసేన అధికారంలోకి వస్తే బ్రాహ్మణుల ఆత్మగౌరవానికి భంగం వాటిల్ల కుండా చర్యలు తీసుకుంటాం. వారి భాషను యాసను కించపరచకుండా చర్యలు తీసుకుంటాం. కులాల వారీగా హాస్టల్స్ కాకుండా కామన్ స్కూల్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తాం. బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 1500కాదు ఇంకో వెయి కోట్లు ఎక్కువే ఇస్తామ”ని హామీ ఇచ్చారు.