‘ప్రయాగ్‌రాజ్‌’గా అలహాబాద్‌


గంగ, యమున నదులు కలిసే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అని పిలుస్తారు. అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ నగరం పేరును ‘ప్రయాగ్‌రాజ్‌’గా మార్చారు. నిజానికి అలహాబాద్ పురాతన కాలంనాటి పేరు ప్రయాగ్. దానిని మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలన సమయంలో అంటే 16వ శతాబ్దంలో పేరు మార్చారు. అక్బర్ అక్కడో కోటను నిర్మించి దానితోపాటు చుట్టుపక్కల ప్రాంతానికి ఇలహాబాద్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత అక్బర్ మనువడు షాజహాన్ ఆ పేరును అలహాబాద్‌గా మార్చారు.

అలహాబాద్‌లో కుంభమేళా ఎంతో ఘనంగా జరుగుతుంది. లక్షలాది మంది ప్రజలు హాజరవుతారు. 2019లో జరిగే కుంభమేళా కంటే ముందుగానే నగరం పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలని యోగి భావించారు. గత శనివారమే అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పిన విషయం తెలిసిందే. అలహాబాద్ నగరాన్ని ఈ రోజు నుండి ప్రయాగ్‌రాజ్‌ అని పిలుస్తున్నాం అని యూపీ ఆరోగ్య శాఖ మంత్రి సిద్ధార్థ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.

సంగం సిటీ అని కూడా పిలువబడే అలహాబాద్ పేరును మార్చడంపై మేధావులు, ఉపాధ్యాయులు, సామాన్య ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోందని జాతీయ మీడియా కథనం. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఈ నగరం ముఖ్యపాత్ర పోషించిందని, పేరు మార్చడం అంటే నగర ప్రాముఖ్యతను తగ్గించడమే అని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. మరోప్రక్క దీనిపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. యోగి ప్రభుత్వం ఊర్ల పేర్లు మార్చడమే పనిగా పెట్టుకున్నట్లు ఎద్దేవా చేశారు.