త్రివిక్రమ్ బాటలో బోయపాటి..?

బోయపాటి శ్రీను ఈ పేరు చెపితే మాస్ ఆడియన్స్ పండగ చేసుకుంటారు. మాస్ ప్రేక్షకులకు ఏం కావాలో బోయపాటికి తెలిసినంత మరో డైరెక్టర్ కు తెలియదనే చెప్పాలి. కథ విషయం లోనే కాదు టైటిల్ విషయంలోనూ మాస్ ఉండేలా చూసుకుంటాడు. అలాంటి ఈయన ఇప్పుడు త్రివిక్రమ్ బాటలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల త్రివిక్రమ్ తన సినిమాలకు క్లాస్ టైటిల్స్ పెట్టడం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ కు అత్తారింటికి దారేది , నితిన్ కు అ ఆ, అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ కు అరవింద సమేత ఇలా తన ప్రతి సినిమాకు క్లాస్ టైటిలే ఫిక్స్ చేస్తున్నాడు.

ఇప్పుడు బోయపాటి కూడా అదే రూట్లో వెళ్తున్నట్లు అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మొన్నటి వరకు ఈ చిత్ర టైటిలే స్టేట్ రౌడీ అని ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ తాజాగా ఈ చిత్రానికి ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర నిర్మాత దానయ్య ఇటీవల ఫిలిం ఛాంబర్ లోఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయింది. మరి ఈక్లాసిక్ టైటిల్ ఈచిత్రం కోసమా లేక మరో చిత్రానికా అనే విషయం తెలియాల్సి ఉంది.