రివ్యూ : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

రివ్యూ : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 

తెలుగుమిర్చి రేటింగ్‌ :  4/5

Seethamma vakitlo sirimalle chettu movie review

నటీనటులు : వెంకటేశ్‌, మహేశ్‌ బాబు, అంజలి, సమంత, ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ తదితరులు
సంగీతం : మిక్కీ జె మేయర్‌
నిర్మాత : దిల్‌ రాజు
దర్శకత్వం : శ్రీకాంత్‌ అడ్డాల

SVSC Review in English

గుండెను స్పర్శిస్తూ.. కళ్ళు చెమ్మగిల్లేలా చేసిన “సీతమ్మ…”

ఎంతకాలమయ్యింది… తెలుగు సినిమాలో హీరోని… దైవాంశ సంభూతుడిగా కాకుండా ఓ మామూలు మనిషిగా చూపించి…

ఎంతకాలమయ్యింది… తెలుగు సినిమాలో ఓ కధని కల్పనలా కాకుండా… జీవితంలో ఓ భాగంగా తీర్చి దిద్ది…

ఎంతకాలమయ్యింది… ఓ సినిమాని సినిమాగా కళ్ళముందుకు తీసుకొచ్చి..!

సినిమా కధ అంటే.. గాల్లో పుట్టే వస్తువు కాదు, జీవితాల సారాంశం అని చెప్పుకోవడం మినహా… ఆ దారిలో వెళ్లి ప్రయత్నించిన వాళ్ళు లేరు. వున్నా… మన కమర్షియాలిటీ విలువలకు భయపడి ఎక్కడో దాక్కుంటారు. ధైర్యం చేసి వచ్చినా… ఎక్కడో ఓ చోట… ఎవరో ఒకరి కోసం వ్యాపార సూత్రాల మేళవింపులో క్లీన్ బౌల్డ్ అవుతారు. మాస్ హీరో కధలో వుంటే…. అతని కోసం పాటలూ, మాస్ మసాలా వ్యవహారాలూ వచ్చి చేరుతూ వుంటాయి. ఇవన్నీ పక్కన పెట్టడానికి ఒకవేళ హీరోలు ఒప్పుకున్నా ఫాన్స్ ‘ససేమీరా’ అంటారు. ఎన్ని గండాలని , ఎన్నో మొసళ్ళు వున్న ‘పెద్ద హీరో’ అనే సినిమా సముద్రాన్నీ ‘మంచి కధ’ అనే నావతో దాటేసింది… ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం. ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముంగిటకు వచ్చిన ఈ మల్టీస్టారర్ సినిమా పై అందరికీ ఎన్నో అంచనాలూ, మరెన్నో అనుమానాలూ వున్నాయి. వాటికి ‘సీతమ్మ…’ చెప్పిన సమాధానం ఏమిటో తెలుసుకునే ముందు.. ఈ సినిమా కథేమిటో గమనిస్తే…

అనగా అనగా ఓ మంచి కుటుంబం. సీతారాముల్లాంటి అమ్మా, నాన్న(జయసుధ, ప్రకాష్ రాజ్). నాన్న భలే మంచోడు. అందరిలోనూ మంచే చూస్తాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్దోడు (వెంకటేష్) ఒకరితో మాట పడడు . ‘నేనేంతే… ఇలాగే వుంటా’ అనే రకం. ఎక్కాడా స్థిరంగా వుద్యోగం చేయడు. చిన్నోడు (మహేష్ బాబు) మాటకారి. మాటలతోనే బూరెలు వండేస్తాడు. కాస్త సర్దుకు పోతూ… కాస్త నటిస్తూ బతికేస్తాడు. అతని అందానికి అమ్మాయిలు గబుక్కున పడిపోతారు. ఇదే ఇంట్లో సీత (అంజలి) కూడా వుంటుంది. బంధువుల అమ్మాయి. చిన్నప్పుడే అమ్మా, నాన్న దూరమైపోతే… ఈ ఇంట్లోనే పెరిగి పెద్దదయ్యింది. చిన్నప్పటి నుంచి… సీత, పెద్దోడి పెళ్ళామే అని ఆ వూర్లో అంతా చెప్పుకుంటున్నారు. విజయవాడలో వుండే సీత బాబాయ్ లు(రావు రమేష్ అండ్ కో)కి ఈ ఇల్లంటే అసలు పడదు. ‘యోగ్యత’ లేనివాల్లుగా జమకడతారు. పైగా డబ్బు ఎలా సంపాదించాలో, ఎలా బతకాలో తెలియదు.. అనే ఓ ముద్ర వేస్తారు. దాంతో… వాళ్ళంటే పెద్దోడికి గిట్టదు. అయితే అనుకోకుండా ఆ యింటి నుంచే చెల్లాయికి ఓ సంబంధం వస్తుంది. పెద్దోడికి ఇష్టం లేకపోయినా తమ్ముడికీ, అమ్మా నాన్నకీ నచ్చిందని ఒప్పుకుంటాడు. పెళ్ళిలో తనకి జరిగిన అవమానాన్నీ సహిస్తాడు. ”సీత పై మీకెంత బాధ్యత వుందో, మాకూ అంతే వుంది. బాధ్యత లేని పెద్దోడికి ఇచ్చి కట్టబెట్టలేం. మంచి సంబంధం చూసి మేమే పెళ్లి చేస్తాం” అంటారు. ఆ ఇంటి అమ్మాయినే (సమంతని) చిన్నోడు ప్రేమిస్తాడు. ఆ తరవాత జరిగిన పరిణామాలేమిటి? సీత పెద్దోడి భార్య అయ్యిందా లేదా? పెద్దోడు బాధ్యత ఎప్పుడు తెలుసుకున్నాడు? తమ్ముడి ప్రేమ కధ ఏమయ్యింది? ఈ సంగతుల సమాహారమే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా.

నిజం చెప్పాలంటే ఈ సినిమా కి ప్రత్యేకంగా ‘ఇదీ కధ..’ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. రామ లక్ష్మణుల లాంటి ఇద్దరు అన్నాదమ్ముల కధ ఇది. వారి వ్యక్తిత్వాలు రెండూ విభిన్నం.. ఆలోచించే పద్దతి వేరు. కానీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఎవరు గీసుకున్న గిరిలో వారే ఉంటూ… మరొకరిని ఏ కంటితో చూశారు, ఒకరి భావాలను మరొకరు ఎలా అర్ధం చేసుకున్నారు? అనే విషయాలే ఈ సినిమాకి మూలం. ఈ సినిమా కుడా వాటి చుట్టూనే పరిభ్రమిస్తూ వుంటుంది. మిగిలిన పాత్రలు… ఈ అన్నదమ్ముల అనుబంధానికి ఆధారంగా అల్లుకున్న తీగలే! 25 ఏళ్ళ తరవాత తెలుగులో రూపుదిద్దుకున్న తొలి మల్టీ స్టారర్ సినిమా ఇది. ఒక్క మాస్ హీరో దొరికితేనే… కమర్షియల్ సూత్రాలతో కధని నడిపించేసి, రిస్క్ లేని ప్రయాణం చేసి డబ్బులు కూడబెట్టుకుందాం అనుకుంటున్న ఈ తరుణంలో, ఇద్దరు కధానాయకులు వుండి కూడా… వారి ఇమేజ్ కీ, స్టార్ స్టేటస్ కీ కాకుండా కేవలం కధకు పెద్ద పీట వేసి… అందుకు అనుగుణంగా సినిమాని తీర్చిదిద్దటం ఓ మొండితనంతో కూడిన సాహసం. అందుకు ఈ యూనిట్ అంతా అభినందనీయులే! వెంకటేష్ కి ఫ్యామిలీ డ్రామాలు కొత్త కాదు. వాటి విలువ తెలిసిన కధానాయకుడు కాబట్టి ఈ సినిమాని చాలా సులభంగా ఒప్పుకుని వుంటారు. కానీ మహేష్ అలా కాదు. ‘దూకుడు’, ‘బిజినెస్ మెన్’ తో…. మాస్ హీరోగా ఆయన ఇమేజ్ మరో మెట్టు ఎక్కింది. ఈ సమయంలో మహేష్ కుడా కుటుంబ బంధాల వైపు నడవడం… అబ్బురపరిచే విషయం. హీరో అనగానే కొన్ని బిల్డప్ లు ఇవ్వడం తప్పని సరి. వారి డ్రస్సింగ్ కుడా చాలా ప్రత్యేకం గా వుండాలి. అవసరమైతే షర్ట్ పైన షర్ట్ వేసుకోవాలి. రెండు ఫాంట్స్ ఒకేసారి తొడగాలి. లేదంటే వారిని హీరోలుగా గుర్తించలేం. కానీ ఈ సినిమాలో అనవసర హంగూ ఆర్భాటాలు వుండవు. ఇద్దరూ చాలా సాదా సీదాగా కనిపిస్తారు. మహేష్ ని టక్ లో చూస్తామని ఎప్పుడైనా ఊహించామా? ఆ అద్భుతం ఈ సినిమాలో జరిగింది. హీరోలంటే దివి నుంచి దిగి వచ్చిన వారు కాదు… మనలోనే వుంటారు అని చెప్పడానికి దర్శకుడు ఎంచుకున్న దారి ఇది. కట్ చేస్తే స్విట్జర్లాండ్ లో పాట వేసుకోరు. కోపం వస్తే పది మందిని బాదేయరు. అచ్చం మనలాగే ప్రవర్తిస్తారు. ఓ మాస్ ఇమేజ్ వున్న హీరోలను ఇలా కూడా చూపించవచ్చా? అనుకునేలా తీర్చి దిద్దారు.

సినిమా మొదలైన కొన్ని నిమిషాలకే తెరపై వెంకటేష్, మహేష్… మాయమైపోయి చిన్నోడు, పెద్దోడు కనిపిస్తారు. ఈ పాత్రలకి పేర్లేమీ పెట్టలేదు. అది దర్శకుడి తెలివైన నిర్ణయం. వాళ్ళను మనం పిలుచుకోవాలన్నా.. చిన్నోడూ పెద్దోడూ అనే అనాలి. మహేష్.. తూర్పు గోదావరి యాసలో మాట్లాడుతూ ఆకట్టుకున్నాడు. అతని నోటినుంచే వినోదాత్మక సంభాషణలు ఎక్కువ పండాయి. మహేష్ మేనరిజం కూడా చాలా కొత్తగా కనిపించింది. సహజంగా చాలా అందగాడు. ఈ సినిమాలో మరింత అందంగా కనిపించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో వెంకీ తో పోటీ పడి నటించాడు. వారిద్దరూ ‘ఒరేయ్.. ఒరేయ్..’ అని మాట్లాడుకుంటుంటే… భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఇక అన్నయ్య గా వెంకీ తనకు అలవాటైన దారిలో దూసుకుపోయాడు. ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్… ఎవరినీ తక్కువ చేయలేం. గుడిలో ప్రకాష్ రాజ్ చెప్పే సంభాషణలే ఈ కధకు మూలం. చివర్లో… మహేష్, వెంకీ నటన పతాక స్థాయి కి చేరింది. కొన్ని సార్లు మనకే కంట్లో నీళ్ళు తిరుగుతాయి. సమంత కంటే… సీతగా అంజలి పాత్రే ఎక్కువ గుర్తుంటుంది. మిక్కీ పాటలు… థియేటర్ లో మరింత బాగున్నాయి. పెళ్లి పాట చిత్రీకరించిన విధానం చాలా సహజంగా అనిపించింది. మణిశర్మ అందించిన ఆర్.ఆర్… చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది. అతని అనుభవం… చాలా కలిసొచ్చింది.

సంభాషణల్లో మెలోడ్రామా వుండదు. చాలా సహజంగా… ఓ అన్నయ్య తన తమ్ముడితో… ఓ తండ్రి తన కొడుకుతో మాట్లాడుతున్నట్టే వుంటాయి. ఇది దర్శకుడి సినిమా. హీరో అంటే… మందు పార్టీ చేసుకోవడానికి ఓ ఫ్రెండ్స్ బ్యాచ్… పాటలు పాడుకోవడానికి ఓ గర్ల్ ఫ్రెండ్ మినహా అతనికి ఓ కుటుంబం వుంటుంది, అనుబంధాలు వుంటాయి అని మర్చిపోతున్న ఈ తరుణంలో ‘సీతమ్మ..’ లాంటి కధలు, సినిమాలు చాలా అవసరం. చూస్తున్నంత సేపు… ఓ సినిమా అనే సంగతి మర్చిపోయి… పక్క పోర్షన్ లో వుంటున్న ఓ కుటుంబాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. ‘కుటుంబాలు బాగుంటే ఊళ్ళు బాగుంటాయి. ఊళ్ళు బాగుంటే సమాజాలు బాగుంటాయి.. సమాజాలు బాగుంటే దేశాలు బాగుంటాయి.. అదే వసుధైక కుటుంబ జీవన విధానం’ అని చెప్పే ప్రయత్నంలో ఓ ఫీల్ గుడ్ మూవీ అందించారు. ఈ సంక్రాతికి కుటుంబం మొత్తం చూడవలసిన సినిమా ఇది.

తెలుగుమిర్చి రేటింగ్‌ :  4/5                                                      – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

 

SVSC Review in English