పాటీదార్ కోటా ఆందోళనకు మూడేళ్లు నిండిన నేపథ్యంలో గత ఆగస్టు 25న గుజరాత్ నేత హార్దిక్ పటేల్ నిరాహార దీక్ష ప్రారంభించారు. పటేళ్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం, రైతుల రుణాలు మాఫీ డిమాండ్లపై 19 రోజులుగా నిరాహార దీక్ష సాగిస్తున్న పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఎట్టకేలకు బుధవారం నాడు దీక్ష విరమించారు.
హార్దిక్ పటేల్ ఆరోగ్యం రోజురోజుకు దిగజారుతున్నదని పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి అధికార ప్రతినిధి మనోజ్ పనారా చెప్పారు. ఒకవేళ తాను మరణిస్తే తన నేత్రాలను దానం చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రకాష్ అంబేద్కర్, హరీష్ రావత్, శరద్ యాదవ్, ఎ.రాజా, యశ్వంత్ సిన్హా, శత్రుఘ్నుసిన్హా వంటి పలువురు నేతలు హార్దిక్‌ను దీక్ష సమయంలో పరామర్శించి ఆయన పోరాటానికి సంఘీభావం తెలిపారు.
ప్రాణాలతో ఉంటే మరోసారి పోరాటం చేయొచ్చంటూ హార్దిక్ మద్దతుదారులు ఆయనకు నచ్చచెప్పి ఒప్పించడంతో హార్దిక్ దీక్ష విరమణకు అంగీకరించారు. సుదీర్ఘ పోరాటం సాగించాలంటే ఆరోగ్యంగా ఉండాలంటూ ట్రస్టీలు, మద్దతుదారులు సూచించడంతోనే దీక్ష నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని, తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని హార్దిక్ ఓ ట్వీట్లో తెలిపారు.