ప్రధాని మోదీ హత్యకు కుట్ర కేసులో వరవరరావు?

విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరరావు ఇంట్లో ఈ రోజు ఉదయం పూణే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తెతో పాటు నాగోల్‌లో ఉంటున్న జర్నలిస్ట్ కూర్మనాథ్, క్రాంతి టేకుల, మరో ఇద్దరు విరసం నేతల ఇళ్లలో పూణె పోలీసులు తనిఖీలు చేపట్టారు. గాంధీనగర్‌లోని వీవీ హౌస్‌లో వరవరరావును పోలీసులు విచారిస్తున్నారు. ప్రధాని మోదీని హత్య చేసేందుకు హత్య కుట్రలో వీరి పేర్లు ఉన్నట్లుగా సమాచారం.

గతంలో ప్రధాని మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రలో వరవరరావు పేరు మావోయిస్టులు రాసిన లేఖలో ఉన్నట్లు గుర్తించిన పుణె పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మావోయిస్టులకు నిధుల సమకూర్చడంలో వరవరరావు పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానపడుతున్నారు. అలాగే ఆయనతో పాటు మోదీ హత్య కుట్రకు సంబంధించి గతంలో కేసు నమోదైన అందరి ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. వరవరరావు ఎవరితోనూ సంప్రదింపులు చేయకుండా ఆయన ఫోన్‌ స్విచ్ ఆఫ్ చేయించి, లోపలినుంచి తాళాలు వేయించి సోదాలు నిర్వహిస్తున్నారు.