డీఎంకే దళపతి స్టాలిన్‌

ద్రావిడ పితామహుడు తందై పెరియార్‌తో విభేదించిన అన్నాదురై ద్రావిడకళగం నుంచి విడివడి 1949లో డీఎంకే పార్టీని స్థాపించారు. అన్నాదురై ముఖ్యమంత్రి ఉండి అనారోగ్యంతో 1969లో కన్నుమూయడంతో,
అప్పటికే ప్రజాపనులశాఖ మంత్రిగా వున్న కరుణానిధి పార్టీలో క్రియాశీలకం ఉండటం వలన అధ్యక్ష పదవికి అర్హుడు అయ్యాడు.

కరుణానిధి తర్వాత పార్టీ బాధ్యతలు ఎవరు చేపడుతారా అన్న సందిగ్ధత డీఎంకే శ్రేణుల్లో చాలా కాలం పాటు ఉండేది. ఈ సందిగ్ధతను తొలగిస్తూ స్టాలినే తన రాజకీయ వారసుడంటూ 2013 జనవరిలో కరుణానిధి ప్రకటించారు. ఇప్పుడు అదే నిజం అయ్యింది. యాభైయేళ్లపాటు ఆ పదవిలో వున్న కరుణానిధి ఆగస్టు 8వ తేదీన మరణించడంతో అధ్యక్ష స్థానం ఖాళీ అయింది.

ఆదివారం అధ్యక్ష పదవి కోసం స్టాలిన్‌ మాత్రమే నామినేషన్‌ వేయడం, మరొకరు నామినేషన్‌ వేయకపోవడం తో అధ్యక్షుడిగా స్టాలిన్‌ పేరును 65 జిల్లాల కార్యదర్శులు కూడా ప్రతిపాదించారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వున్న పార్టీ ప్రిసీడియం కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి, ఎం.కె.స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన స్టాలిన్‌ అన్న అళగిరి మాత్రం కాస్త కలకలం రేపడం జరిగింది. అన్నాదురై, కరుణానిధి తర్వాత 69 ఏళ్ల డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన మూడో వ్యక్తిగా 66 ఏళ్ల స్టాలిన్‌ నిలిచారు.