శ్యాంబెనగల్ కి… అక్కినేని జాతీయ పురస్కారం

Shyam benegal selected for akkineni nageswara rao national awardప్రముఖ దర్శకుడు… భారతీయ చలన చిత్ర జగత్తుకు దార్శనికుడు శ్యాం బెనగల్… 2012 అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం  కి ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద రూ 5 లక్షల నగదు, ఓ జ్ఞాపిక అందిస్తారు. జనవరి 27 న హైదరాబాద్ లో జరిగే ఓ కార్యక్రమంలో ఈ అవార్డ్ అందిస్తారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టుడియోస్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అక్కినేని నాగేశ్వర రావు మాట్లాడుతూ “సినిమా అంటే… వాణిజ్య అంశాలే కాదు.. మానవీయ విలువలు కుడా కావాలని చెప్పిన దర్శకుడు ఆయన. సత్యజిత్ రే తరవాత ఆ స్థాయి వున్న దర్శకుడు ఆయన. ఈ పురస్కారానికి అన్ని విధాలా అర్హుడు” అన్నారు. “మా రోజుల్లో ఇలా అవార్డులు ఇచ్చేవారు కాదు. సినిమా వాళ్ళని నీచంగా చూసే వారు. భోజనాలు కుడా కలిసి చేసేవారు కాదు. ఇప్పడు చాలా మార్పు వచ్చింది. అవార్డులు స్ఫూర్తి రగిలిస్తాయి. మాస్టారు స్టూడెంట్ కి చిన్న బహుమానం ఇస్తే ఎంత పొంగిపోతాడో… ఇలాంటి అవార్డుల వల్ల కళాకారులు అంత పొంగిపోతారు. నాకు ఇన్ని అవార్డులు వచ్చాయంటే.. అదంతా నా గొప్పతనం కాదు. దర్శకులు, సాంకేతిక నిపుణుల గొప్పతనమే” అని నాగేశ్వర రావు చెప్పారు. అవార్డు ప్రదానానికి కేంద్ర మంత్రులు వస్తారని… ఏయన్నార్ అవార్డ్ కమిటీ చైర్మన్ సుబ్బిరామిరెడ్డి చెప్పారు.