ఒకేఒక్కడు కోహ్లీ నెం : 1


ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో అదరగొట్టి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా అగ్రస్థానాన్ని సాధించిన విరాట్‌. లార్డ్స్‌ రెండో టెస్టులో పేలవ ప్రదర్శన చేసి అగ్రస్థానాన్ని పోగొట్టుకొని రెండవ స్థానముతో సరిపెట్టుకున్నాడు. మళ్ళి ఇప్పుడు ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 97, రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులు సాధించడంతో తిరిగి అగ్రస్థానాన్ని అందుకున్నాడు. ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో కోహ్లీ తిరిగి అగ్రస్థాననికి చేరుకున్నాడు.

937 పాయింట్లతో విరాట్‌ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ (929) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ టెస్టు కెరీర్‌లోనే ఇన్ని రేటింగ్‌ పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి. 2011, జూన్‌లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానాన్ని దక్కించుకోగా.. ఆ తర్వాత ఆ ఘనత అందుకున్న భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రమే. అత్యధిక రేటింగ్‌ పాయింట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం 11వ స్థానంలో నిలిచాడు. టాప్‌-10లో పుజారా కూడా 6వ స్థానంతో కొనసాగుతున్నాడు.. రహానె 19వ, శిఖర్‌ ధావన్‌ 22వ స్థానంలో కొనసాగుతున్నారు..

బౌలర్ల విషయానికొస్తే బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రవీంద్ర జడేజా స్థిరంగా 3వ స్థానంలో, రవిచంద్రన్‌ అశ్విన్‌ 7వ స్థానంలో, షమి 22వ స్థానంలో కొనసాగుతున్నారు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసుకున్న హార్దిక్ పాండ్యా బౌలర్ల జాబితాలో ఏకంగా 23 స్థానాలు మెరుగుపరచుకొని 51వ ర్యాంకులో నిలిచాడు. మరియు ఆల్‌రౌండర్ల జాబితాలో27 స్థానాలు ఎగబాకి 17వ ర్యాంకును దక్కించుకున్నాడు. అలాగే కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడి, మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి రాణించిన జస్‌ప్రీత్ బుమ్రా కూడా 37వ ర్యాంక్‌కు ఎగబాకాడు.